Tuesday, November 5, 2024

కాంగ్రెస్ పార్టీలో ‘ఫ్యామిలీ ప్యాక్కు’ చెక్ ?

- Advertisement -
- Advertisement -

ఒకే ఇంట్లో రెండు కాదు… ఒకటే టికెట్ ఇచ్చే అవకాశం
ఇప్పటికే కమిటీల ఎదుట తమ వాదనలు వినిపిస్తున్న నాయకులు
రెండు టికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు
అసంతృప్తులు చెలరేగకుండా అధిష్టానం ఆలోచన

మనతెలంగాణ/హైదరాబాద్ :  కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ ప్యాక్ కు  చెక్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలామంది కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు తమ పిల్లలకు, తమ ఇంట్లో వారికి కూడా టికెట్‌లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారీగా టికెట్‌ల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకోగా ఇలా ఒకే ఇంట్లో రెండు టికెట్‌లను కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటన్నది కొత్తగా కాంగ్రెస్ నాయకులు పిఈసీ కమిటీతో పాటు స్క్రీనింగ్ కమిటీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఫ్యాక్ కోసం దరఖాస్తు చేసుకున్న నాయకుల విషయంలో అధిష్టానం కూడా ఆచితూడి అడుగులు వేయాలని కాంగ్రెస్ కూడా భావిస్తున్నట్టుగా తెలిసింది. ఫ్యామిలీ ఫ్యాక్‌కు సంబంధించి ఒక్కరికీ టికెట్ ఇస్తేనే రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒకవేళ ఒక ఇంట్లో రెండు టికెట్‌లు ఇస్తే చాలావరకు అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉందని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.
అధిష్టానానికి కూడా నచ్చచెబుతాం
ప్రస్తుతం పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫ్యామిలీ ప్యాక్ దరఖాస్తులను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారు.. దీంతో ఒక్కరికి టిక్కెట్ ఇవ్వడమే గగనం అనుకుంటే ఈ ఫ్యామిలీ గొడవ ఏమిటని హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఫ్యామిలీ ఫ్యాక్ కింద దరఖాస్తు చేసుకున్న నాయకులు మాత్రం తాము పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, కుటుంబమంతా కష్టపడుతోందని, రెండు టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని వారు కమిటీల ఎదుట గట్టిగా వాదిస్తున్నట్టుగా తెలిసింది. కావాలంటే అధిష్టానానికి కూడా తాము నచ్చచెబుతామని తాము ఇచ్చిన దరఖాస్తులను ఒకే చేయాలని వారు ఈ కమిటీలతో పేర్కొన్నట్టుగా సమాచారం.
కమిటీలకు తలనొప్పిగా….
ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్న వారిలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, కొండా సురేఖ, బలరాం నాయక్, సీతక్క, దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫ్యామిలీలో తనకు, తన భార్య ఉత్తమ్ పద్మావతికి ఇద్దరికి టికెట్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తమ్ పద్మావతి మాజీ ఎమ్మెల్యే కావడం తో టిక్కెట్ విషయంలో ఏఐసిసి సానుకూలంగా ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక జానారెడ్డి తన ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి,జై వీర్ రెడ్డిలకు నాగార్జున సాగర్, మిర్యాలగూడ టిక్కెట్ అడుగుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క తన కొడుకు సూర్యం ను ఈ ఎన్నికల్లో బరిలో దింపాలనుకుంటుంది. సూర్యం కు పినపాక టిక్కెట్ అడుగుతోంది. మరోనేత బలరాం నాయక్ తనకు మహాబూబాబాద్ టిక్కెట్, తన కొడుకు సాయిరాం శంకర్‌కు ఇల్లందు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కొండా మురళి దంపతులు రెండు టిక్కెట్‌ల కోసం పట్టుబడుతున్నారు. కొండా మురళీ పరకాల, కొండ సురేఖ వరంగల్ తూర్పు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక దామోదర రాజనర్సింహ ఫ్యామిలీ నుంచి దామోదర తో పాటు తన కూతురు దరఖాస్తు చేసింది.. అయితే ఇందులో టిక్కెట్ తనకు కాకపోతే తన కూతురుకు టిక్కెట్ ఇవ్వాలని దామోదర రాజనర్సింహ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక మరోనేత అంజన్ కుమార్ యాదవ్ అయితే తనకు తన ఇద్దరు కొడుకులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ముషీరాబాద్ టిక్కెట్ తనకు లేదంటే తన పెద్ద కొడుకు అనిల్ కు, గోషామహాల్ టిక్కెట్ తన చిన్న కొడుక్కు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు అంజన్ కుమార్ పెట్టడంతో ప్రస్తుతం ఈ అంశం కమిటీలకు, అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News