Saturday, November 9, 2024

రైతుబంధుకు చెక్ !

- Advertisement -
- Advertisement -

పథకంపై గందరగోళం… రైతుల్లో ఆయోమయం
సాయం పంపిణీపై తలోమాట
వ్యవసాయ, ఆర్ధిక శాఖలు మౌనం

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలిచే రైతుబంధు పధకానికి చెక్ పడబోతోందా..ఈ పథకం సమూల మార్పులకు గురికాబోతోందా..రైతుల్లో పేద రైతులు.. పెద్ద రైతులు అన్న వర్గీకరణ జరగబోతోందా.. పెద్దరైతులకు రైతుబంధు సాయంలో గండి పడనుందా ..కొత్త ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరి మాటలు.. చేస్తున్న ప్రకటనలు చూస్తే నిజమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నిరంతరాయంగా అమలు చేస్తూ వచ్చిన ఈ పథకం రాష్ట్రంలో రైతుకుటుంబాలకు ఆర్ధికంగా పెద్ద అండనిచ్చింది. వ్యవసాయరంగంలో వేగవంతమైన ప్రగతికి బీజం వేసింది. అంతబలీయంగా పెనవేసుకపోయిన ఈ పథకం పట్ల ఇప్పుడు రైతుల్లో గందరగోళం నెలకొంది.

ప్రభుత్వంలో బాద్యాతాయుమైన స్థానాల్లో ఉన్న కొందరు ఈ పధకంపై చేస్తున్న ప్రకటనల వల్ల రైతుబంధు సాయంపై రైతాంగంలో ఆయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతియేటా ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు చొప్పున క్రమం తప్పకుండా ఖరీఫ్ రబీ సీజన్లకు పంటల పెట్టుబడి సాయం అందచేస్తూ వస్తోంది. 2018నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో పెనుమార్పులకు దారి తీసింది. రైతులు పంటల పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారల కంబంధ హస్తాల్లో చిక్కుకోకుండా వారికి ప్రభుత్వమే పెట్టుబడి సాయం సమకూరుస్తోంది. మద్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శంగా నిధులను నేరుగా రైతుల ఖాతాలకే జమ చేస్తూ వస్తోంది. ఈ సారి కూడా రబీ సీజన్‌కు సంబంధించి నవంబర్ చివరి వారంలోనే నిధులు రైతుల ఖాతాలకు జమ కావాల్సివుండగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి నిధుల జమ ఆగిపోయింది. ఎన్నికలు ముగిసిపోయాయి. కోడ్ కూడా తొలగిపొయింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఇవాళో రేపో రైతుబంధు నిధులు జమ చేస్తుందని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఈ పథకం పట్ల ప్రభుత్వంలోని కీలక స్థాయి వారి నుంచి వస్తున్న ప్రకటనలు గందరగోళంలో పడవేస్తున్నాయి. రాష్ట్ర రవాణా ,వెనుకబడిన తరగతుల సంక్షమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో చేసిన ప్రకటన రైతులను నిరాశపరుస్తోంది.

రైతుబంధు పథకం నిధులు ఈ నెలాఖరులో విడదల చేస్తామని మంత్రి ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి చేసిన ప్రకటన కూడా మరింత ఆయోమయంలో పడవేసింది. సాగుచేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందించేలా ప్రభుత్వం రైతుబంధు పధకంపై సమీక్ష నిర్వహించనుందని ప్రకటించారు. రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం నిధులు ఈ నెల చివరన జమ చేయనుందని వెల్లడించారు. ధరణిలో తప్పోప్పులను ప్రభుత్వం పరిశీలిన చేస్తుందన్నారు ,కొంతమంది భూస్వాములు , రియల్ ఎస్టేట్ వ్యాపరాలు వందల ఎకరాలు సాగు భూములుగా చూపిస్తూ రైతుబంధు సాయం పొందుతున్నారని ఆరోపించారు. దీనిపై పునరాలోచన చేసి సాగు చేసే భూములకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి రూ.7500 చొప్పున సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలిపారు. అయితే ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి ఇంకా ఎటువంటి అభిప్రాయాలు వెలువడలేదు. రైతుబంధు పథకం అమలులో ప్రధానబాధ్యతగల వ్యవసాయశాఖ, నిధులు సమకూర్చే ఆర్ధిక శాఖలు మాత్రం అధికారపార్టీ నేతల నుంచి వెలువడుతున్న విభిన్న ప్రకటనలపై మౌనంగానే ఉన్నాయి.

విధానపరమైన నిర్ణయాలతో మరింత జాప్యం!
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయరంగంలో అత్యంత కీలకమైన రైతుబంధు పధకాన్ని సమూలంగా మార్చివేసేదిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. విధాన పరమైన నిర్ణయం జరిగి ఈ పథకం సరికొత్తగెటప్‌లో అమలులోకి వచ్చేసరికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి ఈ నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలోగాని రైతుబంధు నిధుల పంపిణీ జరిగేలాలేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. వివక్ష లేకుండా ప్రతిరైతుకు అందిన సాయం ఈ ప్రభుత్వంలో ఇక కొందరికే పరిమితం అవుతుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఐదు ఎకరాల రైతులకు మాత్రమే రైతుబంధు పథకాన్ని పరిమితం చేసే విధంగా, 10ఎకరాల వరకే పరిమితం చేసే విధంగా రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.  మొదటి ప్రతిపాదన మేరకు ఎంత మంది రైతుబంధుకు అర్హత పొందతారు , నిధుల అవసరం ఎంత అని కూడా లెక్కలు తేలుస్తున్నారు. అదే విధంగా పది ఎకరాల వరకే సీలింగ్ విధిస్తే ఎంత మంది రైతులను తొలగించ వచ్చు , ప్రభుత్వానికి ఎంత నిధులు మిగులబాటు అవుతాయి అన్నది కూడా పరిశీలన చేస్తున్నారు. రైతుబంధు ప్రధకంలో మార్పులు చేర్పులు కొత్త విధాన నిర్ణయాలు పూర్తయ్యేసరికి మరికోంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అప్పటిదాక రైతుబంధు నిధుల కోసం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఓపికగా ఎదురు చూడక తప్పేలా లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News