Sunday, December 22, 2024

ఇక నగరంలో అర్ధరాత్రి వాహన తనిఖీలు

- Advertisement -
- Advertisement -

Check vehicles even at midnight:MV Ranganth

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా
హెల్మెట్ , పత్రాలు లేకున్నా జరిమానా
కొత్తగా అమలు చేయనున్న నగర ట్రాఫిక్ పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కొత్త అస్త్రం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు వాహనాల తనిఖీలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పగటి సమయంలో మాత్రమే చేసేవారు. ఇక నుంచి అర్ధరాత్రి కూడా వాహనాలను తనిఖీ చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ప్రకటించారు. అర్ధరాత్రి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా పోలీసులు తనిఖీలు చేపడతారని వాహనదారులు పగటి సమయంలో నిబంధనలు పాటించేవారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకుని తనిఖీలు చేపట్టేవారు. వాహనాలను ఆపి పత్రాలు, హెల్మెట్ లేకున్నా, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నవారికి జరిమానాలు విధించేవారు. అలాగే వాహనాలను ఆపి పెండింగ్ చలాన్లను చూసి వాహనాలను ఆపివేసే వారు. మూడు చలాన్ల కంటే ఎక్కువగా ఉన్న వారి వాహనాలను ఆపివేసి కట్టిన తర్వాతే విడిచి పెడుతున్నారు.

మూడు చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఈ తనిఖీలు ఇప్పటి వరకు పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించేవారు. సాయంత్రం తర్వాత వెళ్లి పోయేవారు. కానీ నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ రాత్రి సమయంలో కూడా వాహనాల తనిఖీ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అర్ధరాత్రి సమయంలో కూడా ట్రాఫిక్ పోలీసులు నగరంలో వాహనాల తనిఖీ చేపట్టనున్నారు. గతంలో ఇలా లేకపోవడంతో వాహనదారులు చాలామంది నిబంధనలు ఉల్లంఘించే వారు. హెల్మెట్ పెట్టుకోకుండా, పత్రాలు సరిగా లేకున్నా వాహనాలతో రోడ్డుపైకి వచ్చే వారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ నిబంధనలు కూడా చాలామంది వాహనదారులు పాటించడంలేదు. పోలీసులు రోడ్లపైన లేకపోవడం ఉన్న వారు చూసీచూడనట్లు వ్యవహరించడంతో వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తెల్లవారే వరకు…

సాధారణంగా హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను రాత్రి 12గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెల్లవారే వరకు నిర్వహించనున్నట్లు తెలిసింది. మద్యం తాగి వాహనాలు నడుపుతుండడంతో చాలామంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందుతున్నారు. బంజారాహిల్స్ రెయిన్‌బో ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు వర్కర్లను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన అర్ధరాత్రి తర్వాత జరగడంతో పెట్రోలింగ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అర్ధరాత్రి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టకపోవడంతో మందుబాబులు మద్యం తాగి వాహనాలను నడుపుతున్నారు. పోలీసులు తనీఖీలు నిర్వహించరని తెలియడంతో వారు లేని సమయంలో మద్యం తాగి కార్లతో రోడ్లపైకి వచ్చి భీభత్సం సృష్టి స్తున్నారు. మందు బాబుల ఆగడాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News