Friday, December 20, 2024

చోరీలు చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను మియాపూర్, మాదాపూర్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.4లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి సందీప్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం, దోడా జిల్లాకు చెందిన మీనామా ముఖేష్‌బాయ్ భహరూభాయ్, విక్రం భాయ్ ధరియాభాయ్ పర్‌వార్, మోహనియా నితిన్‌భాయ్, సుర్‌మాల్ అలియాస్ సుమో కలిసి చోరీలు చేశారు. ఇందులోని సభ్యుడు విక్రం హైదరాబాద్‌లో ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు. తాను పనిచేసిన వాటిలో సంపన్నుల ఇళ్లను గుర్తించాడు. తాను చెప్పిన ఇళ్లల్లో చోరీలు చేయాలని మిగతా వారికి చెప్పాడు.

దీంతో వారు గుజరాత్ నుంచి ఈ నెల 5వ తేదీన రైలు ద్వారా హైదరాబాద్‌కు వచ్చారు. వారినికి కలిసిన విక్రం అమీన్‌పూర్‌లో చోరీ చేయాల్సిన ఇళ్లను చూపించాడు. తర్వాత నిందితులు ఇళ్లకు సమీపంలోని అడవిలో దాక్కున్నారు. రాత్రి కాగానే నిందితులు ఆయా ఇళ్లల్లోకి చేరుకుని చోరీ చేశారు. ఈ సమయంలో తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చెడ్డీ, బనియన్‌పై వెళ్లి చోరీ చేయడంతో సిసిటివిలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను కనిపెట్టారు. నిందితులపై గుజరాత్ రాష్ట్రంలో ఇదివరకు కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ ఇన్స్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, సిసిఎస్ మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, డిఐ కాంతారెడ్డి, ఎస్సై లింగం తదితరులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News