అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి టిడిపిలను కలుపుతామనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ కృష్ణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎవరు కలిస్తే వాళ్లు నాశనం కావడం ఖాయమని హెచ్చరించారు. తాను సిఎం కాలేనని, చంద్రబాబు కోసం పని చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read: కర్నాటక కొత్త సిఎం ఎవరో ? ఎంపిక బాధ్యత ఖర్గేకే..
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, తన రాజకీయ జీవితం మొత్తం వైఎస్ కుటుంబంతోనే సాగిందన్నారు. వైఎస్ తనని జడ్‌పి చైర్మన్ చేస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనని మంత్రి చేశారన్నారు. బిసి సంక్షేమ శాఖకు పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ ఏం చెప్తే అది చేయ్యడమే తనకు తెలిసిన రాజకీయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వేణు ధ్వజమెత్తారు. గోదావరి జిల్లాల్లో చంద్రబాబు డ్రామాలు రైతులు నమ్మడం లేదని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, నష్ట పరిహారం ఎగనామం పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారని, పంటలు నష్టపోతే సీజన్ ముగిసేలోపు పరిహారం ఇస్తున్నామన్నారు.