హైదరాబాద్ : నిజాం కళాశాలలో 5 ఏళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ఉపసంహరించడంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం మరింత స్పష్టతనిచ్చింది. అప్పటి అవసరాలకు అనుగుణంగా 2008లో ఐదేళ్ల సమీకృత స్నాతకోత్తర విద్యను అందుబాటులోకి తెచ్చామని కాలక్రమేణా కోర్సులో చేరేవారి సంఖ్య నానాటికి పూర్తిగా తగ్గిపోయిందని పేర్కొంది. కోర్సు ప్రారంభించిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఈ కోర్సులో చేరేవారని ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొందని వర్శిటీ అధికారులు వివరించారు. ప్రస్తుతం మొత్తం 250 సీట్లు అందుబాటులో ఉండగా ప్రవేశపరీక్షకు కేవలం 253 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సైతం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపలేదని తెలిపారు. మొత్తం 250 సీట్లకు 2022- -23 విద్యాసంవత్సరంలో కేవలం 113 మంది మాత్రమే కోర్సుల్లో చేరారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిజాం కళాశాలలో 30 సీట్లు అందుబాటులో ఉన్నా 21 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా చేరలేదని వెల్లడించారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మూడో ఏడాదిలోనే ఎగ్జిట్ అవకాశం ఉండటం వల్ల నాలుగు, ఐదో ఏడాదిలో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. మూడో ఏడాది పూర్తైన విద్యార్థులు తమకు ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసేందుకు ఎగ్జిట్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
సెల్ఫ్ పైనాన్స్ కోర్సు కేటగిరిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు నడుస్తోందని, డిమాండ్ లేని కారణంగా ఆర్థికంగానూ విశ్వవిద్యాలయంపై భారం పడుతుందని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి దాదాపు రూ. 35 లక్షల అదనపు భారం పడిందని చెప్పారు. ఈ సెల్ఫ్ పైనాన్స్ కోర్సును పూర్తిగా పార్ట్ టైం లెక్చరర్స్ పై ఆధారపడి నడపవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజాం కాళాశాలలో ఇటీవలి కాలంలో 12 పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే కేవలం 4గురు మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. అందులోనూ ముగ్గురు వివిధ కారణాలతో వెళ్లిపోయారని కేవలం ఒక్కరితో కోర్సును నడపలేమని చెప్పారు. నాలుగు స్పెషలైజేషన్లతో రెగ్యులర్ ఎమ్మెస్సీ కోర్సును కేవలం ఇద్దరు పూర్తిస్థాయి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నామని వివరించారు. ఐదేళ్లుగా పూర్తిగా ఆదరణ తగ్గుతూ వస్తుండటంతో 2023-2024 నుంచి ఈ కోర్సును ఉపసంహరించుకున్నట్లు యూనివర్శిటీ తెలిపింది.
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణ వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు కోర్సుల ప్రగతిని సమీక్షిస్తూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెడుతూ వస్తోందన్నారు. ఇటీవల కాలంలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డాట సైన్స్ సహా అనేక కొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను అందిస్తోంది. అదే సందర్భంలో వివిధ కారణాలతో ఆచరణ సాధ్యం కాని కోర్సులను ఉపసంహరించుకుంటోందని వెల్లడించారు. విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్య అందించటం యూనివర్శిటీకి సవాల్ గా మారటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యూనివర్శిటీ స్పష్టం చేసింది.