Wednesday, July 3, 2024

నిమ్స్ ఆస్పత్రిలో కోలుకున్న చెంచు మహిళ

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ (20) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశంయాదగిరి, దయాల జితేందర్‌లు ఈశ్వరమ్మను నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం పరామర్శించారు. ప్రాణాపాయ స్థితిలో ఈశ్వరమ్మ నిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి దగ్గరుండి వైద్యసేవలు అందేలా చేశారని పాశం యాదగిరికి బాధితురాలి భర్త ఈదన్న, అక్క పుల్లమ్మ, కూతుళ్లు నీలవేణి, జ్యోతి, ఇతర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని పాశం యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలిసి మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అటవీ హక్కుల చట్టాలను, ఆదివాసీ చట్టాలను పక్కాగా అమలు చేయాలని పాశం యాదగిరి డిమాండ్ చేశారు.

ఆదివాసీ హక్కులు, ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎంత పకడ్బందిగా అమలవుతున్నాయో అవగాహన కల్పించడానికి ఆదివాసీ చైతన్యం రగల్చడానికి రాష్ట్రంలోని ఆదివాసీ ప్రతినిధులను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మేందాలేఖ (గోండుగూడెం)కు ఒక ప్రతినిధి వర్గాన్ని త్వరలోనే తీసుకెళతామని పాశం యాదగిరి చెప్పారు. జూలై 1న మంత్రి సీతక్కతో పాటు ఆదివాసీ హక్కల సంఘాల ప్రతినిధులు చెంచుగూడాలను సందర్శిస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 20న చెంచు మహిళపై నరరూప రాక్షసుల అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ నామమాత్రం ధరకు కొనుగోలు చేశాడు. డబ్బులు మొత్తం చెల్లించకుండానే బలవంతంగా తన పేర రాయించుకున్నాడు. భూమి యజమానులైన ఈశ్వరమ్మ, ఈదన్నలను వారి భూమిలోనే కూలివాళ్లుగా మార్చి, వెట్టిచాకిరి చేయించాడు. కొద్దిరోజులుగా పనికి రావడం లేదని ఈశ్వరమ్మను అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు.

వెంకటేశ్ అక్క, కుటుంబ సభ్యులు కలిసి ఈశ్వరమ్మ కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. ఆ వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్థానికుల సాయంతో బాధితురాలిని తొలుత కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్ప ఆధ్వర్యంలో వైద్య బృందం మెరుగైన వైద్యం అందించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రి వచ్చిన డా.తిరుమణి ఝాన్సీ వైద్యసేవలను పర్యవేక్షించారు. మంత్రి సీతక్కకు, నిమ్స్ ఆస్పత్రి సిబ్బందికి, నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి బాధితురాలు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News