Thursday, January 23, 2025

చేనేత హరివిల్లు ‘తేలీ గ్యాలరీ’

- Advertisement -
- Advertisement -

నూలు పోగులకు రంగుల మిశ్రమం అద్ది మగ్గం మీద ఆడిస్తే అదో అద్భుతమైన వస్త్ర కళాఖండంగా తయారవడమే ‘చేనేత’ కళాసృష్టి. రాజుల రాజసం, వ్యక్తుల వ్యక్తిత్వం, మహిళల సోయగంతో ముడిపడిన వస్త్రాలు చేసే మాయాజాలం అంతా ఇంతా కాదు. చేనేత కళాకారుడి కళాతృష్ణతో రూపుదిద్దుకున్న చీరలు, వస్త్రాలు మన దేశ ఔన్నత్యాన్ని, ఆచార వ్యవహారాలను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో తయారయ్యే ఇక్కత్, తేలియా రుమాలు, గొల్లభామ, గద్వాల పట్టు చీరలకు ఘనమైన చరిత్ర వుంది.

ఇవన్నీ ఒక చోట కొలువదీరితే చూడాలని కళా హృదయమున్న ప్రతి వ్యక్తీ కోరుకోవడం సహజం. ఇటీవల పద్మశ్రీ గజం గోవర్ధన్ నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాల తో ఏర్పాటు చేసిన ‘తేలీరుమాల్ ఆర్టు గ్యాలరీ’ చేనేత నైపుణ్యతను నలుగురికి తెలియజేప్పే రంగుల హరివిల్లులా రూపు దిద్దుకుంది. చేనేత చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా ఉంది. హైదరాబాద్ లోని గడ్డిఅన్నారం డివిజన్ శ్రీనగర్‌కాలనీలోని గోవర్ధన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ధరించిన దుస్తులు, గద్వాల రాణి కట్టిన పట్టుచీర, సిద్దిపేట గొల్లభామ చీర, పోచంపల్లి ఇక్కత్, పుట్టపాగ తేలియా రుమాలు తదితర వస్త్రాలు, వస్త్ర చరిత్రను వివరించే ఫోటోలు, పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీ చేనేత కళాకారులకు, పరిశోధకులకు ఉపయోగ పడేలా తీర్చిదిద్దారు. తెలంగాణలో వస్త్ర కళాకృతులతో ఏర్పాటు చేసిన తొలి గ్యాలరీగా చెప్పుకోవచ్చు.

భారతీయ సంప్రదాయ కళలలో ‘చేనేత’ ప్రముఖ స్థానం కలిగి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది. రోజుల తరబడి కష్టించి తన నైపుణ్యంతో విదేశీయులను సైతం ఆకట్టుకునే పోచంపల్లి పట్టుచీరకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత చేనేత కళాకారుడి సొంతం. పోచంపల్లి ఇక్కత్ చీరకు, పుట్టపాక తేలియా రుమాల్‌కు జాతీయ భౌగోళిక గుర్తింపు (జియో గ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్) లభించింది. హిమ్రు, సిద్దిపేట గొల్లభామ చీర అంతర్జాతీయ గుర్తింపు అందుకుంది. దేశంలోని మరే ప్రాంతంలో లేని ప్రత్యేకతలు ఉన్న ఈ నేతకళలు ప్రపంచంలో తెలంగాణకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, పోచంపల్లి, పుట్టపాక, గద్వాల, నారాయణపేట తదితర ప్రాంతాలలో వేలాది కుటుంబాలు చేనేత పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నా యి. కంప్యూటర్‌కు అందని డిజైన్‌లకు రూపకల్పన చేస్తూ దేశ విదేశాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. నూలు, ఊలుతో నేసే ‘హిమ్రూ’ వస్త్రకళ మహమ్మద్ బిన్ తుగ్లక్ తొలుత ఔరంగాబాద్‌కు తీసుకు వచ్చారు. తర్వాత హైదరాబాద్ పాలకులు నిజాంల షేర్వానీలకు తయారీకి ఈ కళను వినియోగించారు.

పర్షియన్ బ్రోకేడ్ పూలు, లతల డిజైన్‌ను జరీతో నేయడమే ‘హిమ్రు’ కళ ప్రత్యేకత. ఈ కళకు 1972లో కొత్త సొబగులు అద్ది రమణీయ వస్త్రాలకు జీవం పోసింది సురయ హసన్ బోస్. 21వ శతాబ్దం కోసం తయారు చేసిన చేనేత వస్త్రాలు సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో యునెస్కో విడుదల చేసిన నివేదికలో ‘హిమ్రు’, ‘గొల్లభామ’కు గుర్తింపు లభించింది. తొలుత నూలు చీరల నేతకు ప్రసిద్ధి గా ఉన్న పోచంపల్లి, నేడు ఇక్కత్ కళను అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్లింది. అసఫ్ జాహీల పాలనలో వస్త్ర నేతకు బీజం పడగా, 1910 నాటికే ఇక్కడ చిటికి పరిశ్రమ ఏర్పడిం ది.

ఇరవై నంబరు నూలుతో ‘తేలియా రుమాళ్లు’ ను నేసేవారు. హైదరాబాద్‌కు సమీపంలో మూసీ పరివాహక ప్రాంతం కావడంతో నగరానికి వచ్చిపోయే అరబ్బులు వీటిని చూసి ఇష్టపడి కొనుగోలు చేసేవారు. ఆ డిమాండ్‌తో తేలియా రుమాళ్లను అరబ్బు దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభమైంది. ఆ తర్వాత 60 నెంబరు నూలుతో పడుగు, పేకలతో సహజ రంగుల్లో చీరలను నేస్తూ దేశ దృష్టిని ఆకర్షించా రు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో తయారవుతున్న ‘తేలియా రుమాలు’ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రకృతి రంగులతో తయారైన ఈ రుమాలును, అపురూప కళాఖండాలను భద్రపరిచే లండన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం విశేషం. అమెరికా అధ్యక్షుని భవనం వైట్ హౌస్‌లో ఇక్కడ తయారు చేసిన వస్త్రాన్ని అలంకరణకు ఉపయోగిస్తున్నారు.హిమ్రు, గొల్లభామ, ఇక్కత్, తేలియా రుమాలుకు సంబంధించిన వస్త్రాలన్నీ ఈ గ్యాలరీలో సందర్శకులను ఆకట్టుకుంటు న్నాయి. పేరుకు ‘తేలీ రుమాలు ఆర్టు గ్యాలరీ’ అయినప్పటికీ తెలంగాణ చేనేత కళా సంపదను ఇందులో పొందుపరిచారు. అంతే కాకుండా చేనేతకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు పదుల సంఖ్యలో గ్యాలరీలో ఉంచి పరిశోధకులు, విద్యార్థులకు ఉపయోగకరంగా వీలు కల్పించారు.

‘తేలీ రుమాలు ఆర్టు గ్యాలరీ’ రూపకల్పన వెనుక పద్మశ్రీ గజం గోవర్ధన్ నలభై ఏళ్ల చేనేత కృషి ఉంది. బాల్యం నుంచే కొత్తదనాన్ని కోరుకునే తన మనస్సు, పుట్టపాక ఇక్కత్ చీరలు ఆర్జించిన ఖ్యాతిలో తన వంతు నైపుణ్యత ఉంది. తన అన్న గజం రాములు పన్నెండేళ్ల వయస్సు లో తేలియా రుమాలు తయారు చేసి అరబ్బు దేశాలకు ఎగుమతి చేయడం గోవర్ధన్‌ను కదిలించింది. 25 ఏళ్ల వయస్సులో చేనేత సేవా కేంద్రంలో నేతకారుడుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన గోవర్ధన్‌కు ఓ కొత్త వస్త్ర ప్రపంచాన్ని చూపించింది.టై అండ్ డై విధానం, నేత ఉత్పత్తులు, ఆకట్టుకునే డిజైన్ల రూపకల్పన, రంగుల అద్దకాలు ఆయనలోని కళా నైపుణ్యత ను పెంచాయి.

1983లో విదేశాలలో నిర్వహించిన ‘భారత్ ఉత్సవ్’లో మన దేశ ప్రతినిధిగా పాల్గొనడం, అందులో తేలియా రుమాలు వస్త్రాలను ప్రదర్శించడంతో మన దేశ చేనేత సంస్కృతిని చాటిచెప్పే అవకాశం దక్కించుకున్నా డు. ఇక్కత్ కళలో రక రకాల ప్రయోగాలు చేస్తూ దేశవిదేశాల ప్రదర్శనలో పాల్గొంటూ ఈ కళకు విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించాడు. గోవర్ధన్ చేనేత కృషికిగానూ ఆలిండియా హ్యాండ్లూవ్‌ు బోర్డు, ఎపి క్రాఫ్ట్ కౌన్సిలు, ప్రపంచ క్రాఫ్ట్ కౌన్సిలు, ఏషియా ఫసిఫిక్ రీజనల్, ఇంటర్నేషనల్ ఇక్కత్ వీవింగ్ ఫోరవ్‌ులలో సభ్యుడుగా కొనసాగా డు. తేలియా రుమాల్ డాక్యు మెంటేషన్‌తో డైయింగ్ ఆర్టును ఇంగ్లాండు యూనివర్సిటీలో పుస్తక రూపంలోకి తెచ్చాడు. చేనేత రంగం లో చేసిన కృషిగానూ 1983లో జాతీయ పురస్కారం, భారత ప్రభుత్వ అత్యుత్తమ అవార్డు ‘పద్మశ్రీ’ని 2011 లో అందుకున్నాడు.

ఇవే కాకుండా శిల్పగురు, యునెస్కో వంటి మరెన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు గోవర్ధన్ చేనేత కృషికి తోడ్పడినాయి. భావితరాలకు చేనేత జ్ఞాన సంపదను అందించడానికిగానూ గజం గోవర్ధన్ ఏర్పాటు చేసిన ‘తేలీ రుమాలు ఆర్టు గ్యాలరీ’ వందల ఏళ్ల చేనేత చరిత్రకు ప్రతీకలైన అపురూప వస్త్రాల సంపుటి. అన్నం పెట్టిన కులవృత్తిని, తోటి చేనేత కళాకారులను అభ్యుదయ పథంలోకి దారిని చూపేలా గ్యాలరీకి రూపకల్పన జరిగింది. పట్టు, నూలు నేసే వస్త్రాల స్థానంలో సరికొత్తగా క్రేపు, ఊలు, టిష్యూ, జనపనార వంటి దారాలను ఉపయోగిస్తూ వస్త్రాలను రూపొందించే మెళకువలు ఈ గ్యాలరీ బోధిస్తోంది. ఈ గ్యాలరీని ప్రారంభించిన ఐటి, పరిశ్రమలు, పురపాలక, చేనేత శాఖల మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ చేనేతపై పరిశోధనలు జరిపేలా విద్యార్థులకు వీలు కల్పించేందుకు సొంత వనరులతో చేనేత గ్యాలరీని ఏర్పాటు చేశారని తెలుపుతూ గోవర్ధన్‌ను అభినందించా రు. రాష్ర్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో అద్భుతమైన చేనేత మ్యూజియంను ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అడుగులు వేగంగా పడాలని చేనేత కళాకారులు కోరుకుంటున్నారు.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News