చెన్నై: ఈ శతాబ్దంలో సముద్ర మట్టం పెరుగుతున్నందున కొన్ని ఆసియా మహానగరాలు, పశ్చిమ ఉష్ణమండల పసిఫిక్ దీవులు, పశ్చిమ హిందూ మహాసముద్రంపై ప్రభావం పడనున్నది. గ్రీన్ హౌస్ వాయువుల విడుదల ఇప్పటిలానే కొనసాగితే 2100 నాటికి గణనీయ నష్టాలు కలుగనున్నాయి. దాని వల్ల చెన్నై, కోల్‌కతా, యాంగాన్, బ్యాంకాక్, హోచిమిన్ నగరం, మనీలాకు ముప్పు ఏర్పడనుందని పరిశోధన బృందం పేర్కొంది. వాతావరణ మార్పు కారణంగా సముద్ర మట్టం హెచ్చుతగ్గులను ఆ పరిశోధన బృందం అధ్యయనం చేస్తోంది. వారి అధ్యయనం ‘నేచర్ క్లయిమేట్ చేంజ్’ అనే జర్నల్ ప్రచురితమైంది. మంచు కొండలు కరిగిపోతుండడం వల్ల సముద్రంలో నీటి మట్టం పెరుగుతోందని వారు గుర్తించారు.
ఎల్‌నినో వంటి సంఘటనల వల్ల సహజంగా సముద్ర మట్టం హెచ్చుతగ్గులు లేదా నీటి చక్రంలో మార్పులు, అంతర్గత వాతావరణ వైవిధ్యం అని పిలువబడే ప్రక్రియ కొనసాగుతుంది అని ఈ అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పు వల్ల కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ‘వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే సముద్ర మట్టం పెరుగుదలను అంతర్గత వాతావరణ వైవిధ్యం బలోపేతం చేస్తుంది లేదా అణిచివేస్తుంది’ అని పరిశోధన అధ్యయనాన్ని సమర్పించిన సహ రచయిత, ఎన్‌సిఎఆర్ శాస్త్రవేత్త ఐక్సూ హు తెలిపారు.