చెన్నై నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దీంతో వెంటనే విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 6.50 గంటలకు 172 మంది ప్రయాణికులు, సిబ్బందితో చెన్నై నుంచి ఇండిగో విమానం ముంబైకి బయల్దేరింది. కొద్ది సేపటికి విమానంలో బాంబు ఉందనే బెదిరింపు కాల్స్ వచ్చాయి. విమానంలో ఓ రిమోట్ సైతం లభ్యమైంది. వెంటనే స్పందించిన పైలట్లు ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే సమయానికి ముంబై విమానాశ్రయ అధికారులు ఫైర్‌టెండర్లు , అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను క్షేమంగా దించేశారు. అనంతరం రంగం లోకి దిగిన బాంబు స్కాడ్ సిబ్బంది… విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానాన్ని టెర్మినల్ ప్రాంతంలో ఉంచినట్టుగా అధికారులు తెలిపారు. ఇదే విధంగా గతవారం ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లనున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టేకాఫ్ కాకముందే ఈ బెదిరింపు రావడంతో అప్రమత్తమైన అధికారులు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులను దించారు.