భారీ ఆశలతో బెంగళూరు
ఐపిఎల్ 17వ సీజన్ తొలి ఫేజ్ సమరానికి చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (సిఎస్‌కె) జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం చిదంబరం స్టేడియంలో పోరు జరుగనుంది. యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై తొలిసారి బరిలోకి దిగనుంది. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న చెన్నైపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సిఎస్‌కె చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. రుతురాజ్ గైక్వాడ్,అజింక్య రహానె, డారిల్ మిఛెల్, డెవొన్ కాన్వే, ధోనీ, సాంట్నర్, మోయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జడేజా వంటి మ్యాచ్ విన్నర్లు చెన్నైలో ఉన్నారు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టుకు అతని సేవలు చాలా కీలకమనే చెప్పాలి. కొత్త సారథి రుతురాజ్‌ను వెనుక నుండి నడిపించేందుకు ధోనీ సిద్ధమయ్యాడు. జడేజా, రహానెలాంటి సీనియర్లు ఉండడం సిఎస్‌కె ఊరటనిచ్చే అంశమే.
అందరి కళ్లూ కోహ్లిపైనే..
మరోవైపు బెంగళూరులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. చెన్నైతో పోల్చితే బెంగళూరులో మరింత మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి బరిలోకి దిగుతుండడంతో అందరి దృష్టి అతనిపైనే నిలిచింది. అతను ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి టీమ్‌కు కష్టాలు ఖాయం. కెప్టెన్ డుప్లెసిస్‌పై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా డుప్లెసిస్ సొంతం. ఇక మ్యాక్స్‌వెల్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. కిందటి సీజన్‌లో మెరుపులు మెరిపించిన మ్యాక్స్‌వెల్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కామెరూన్ గ్రీన్, అల్జరీ జోసెఫ్, సిరాజ్, దినేశ్ కార్తీక్, ఫెర్గూసన్, ఆకాశ్ దీప్, రజత్ పడిదార్, విల్ జాక్స్, యశ్ దయాళ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు బెంగళూరుకు అందుబాటులో ఉన్నారు. దీంతో బెంగళూరు కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.