Thursday, January 23, 2025

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పి.వి పేరు పెట్టాలి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు అలహాబాద్‌కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా ఇతర ప్రాచీన పేర్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాకు కోలకతగా, బొంబాయిను ముంబైగా, మద్రాస్‌ను చెన్నై గా నామకరణం చేశారు. న్యూఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా, బెంగళూరు విమానాశ్రయానికి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా, వారణాసి విమానాశ్రయానికి భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా, జార్ఖండ్ రాజధాని రాంచీ విమానాశ్రయాంకు ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా ఎయిర్ పోర్టుగా పిలవబడుతుంది. అలాగే మహారాష్ట్ర రాజధాని నగరంలోని రైల్వేస్టేషన్‌కు మరాఠా యోధుడు ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్’గా మార్చబడి ప్రజల మనో భావాలను గౌరవించబడుతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లోని రైల్వే జంక్షన్ మొగల్ సరాయి జంక్షన్‌కు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెర్మినల్, ప్రతాప ఘర్ జంక్షన్‌కు బేల్హాదేవి ధామ్‌గా అంటూ స్టేషన్‌ను మా చంద్రికా దేవి ధామ్‌గా, విశ్వనాథగంజ్ స్టేషన్‌ను శనిదేవ్ ధామ్ విశ్వనాథ్ అని, శ్రీరాముని జన్మస్థాన్ అయోధ్య రైల్వేస్టేషన్‌కు అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చా రు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ను తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎం.జి.రామచంద్రన్ పేరుతో పురచ్చి తలైవా ఎం.జి రామచంద్రన్ ‘టెర్మినల్’ గా, కర్ణాటక రాజధాని బెంగళూరు రైల్వేస్టేషన్‌కు ‘క్రాంతివీర సంగ్రోలి రాయన్న‘స్టేషన్ గా, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ హాబీబ్ గంజ్ రైల్వేస్టేషన్‌కు గోండుల రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా నామకరణం చేశారు, భారత ప్రధాన మంత్రులు, నెహ్రూ, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్, చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజపేయి, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్లతో విశ్వవిద్యాలయాలు, ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, ఉద్యానవనాలకు, భవన సముదాయాలకు వారి పేర్లు కలవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమ నాయకులు కాళోజీ నారాయణ్ రావు పేరుతో హెల్త్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆయన పేరుతో భూపాల్ పల్లి జిల్లా ఏర్పడింది.

ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయంకు గిరిజన దేవతలు ‘సమ్మక్క- సారక్క’ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ముద్దు బిడ్డ, బహుబాషా కోవిదుడు, దక్షిణ భారత దేశం నుంచి ఎన్నికైన ఏకైక ప్రధాని మంత్రి పి.వి.నరసింహ రావు పేరుతో విశ్వవిద్యాలయంగానీ, జిల్లాగానీ లేకపోవడం అత్యంత విచారకరం. కేవలం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం నుంచి ఆరాం ఘర్‌కు నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వే కు మాత్రమే ఆయన గౌరవార్థం పి.వి. ఎక్స్‌ప్రెస్ వే గా నామకరణం చేశారు. ఆర్థిక సంస్కరణలకు పునాది వేసి దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టిన పి.వి.నరసింహారావుకి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి, రాజధాని హైదరాబాద్ చేరాలంటే ఏకైక ముఖద్వారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతం. ఈ భూములు కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ ఆధీనంలో ఉన్నవి. మహారాష్ట్రలోని నాగపూర్ హైవే, కరీంనగర్‌కు వెళ్లే రాజీవ్ జాతీయ రహదారిపై సులువుగా పయనించేందుకు రహదారులను వెడల్పు చేసి కారిడార్లు, ఫ్లై ఓవర్‌ల నిర్మాణం చేయాలంటే రక్షణ శాఖ భూములు అడ్డుగా ఉన్నవి. హైదరాబాద్ చేరువలో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషను పది ప్లాట్ ఫారములు, లిఫ్టులు, ప్రయాణికులకు అన్ని మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించారు. ఇక్కడ నుంచే కొన్ని రైళ్లు బయలు దేరుతాయని దీని వలన సికింద్రాబాద్ స్టేషన్‌కు రైళ్ల రద్దీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అతి త్వరలో ప్రారంభం కానున్న చర్ల పల్లి రైల్వే టెర్మినల్ కు ‘భారత రత్న పి.వి.నరసింహ రావు రైల్వేటెర్మినల్ గా నామకరణం చేస్తే తెలంగాణ ముద్దు బిడ్డ పి.వి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలుస్తుంది. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం కృషి చేయాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News