Friday, December 27, 2024

28న చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి రెండవ ప్రవేశ ద్వారం, నూతన రైల్వే టెర్మినల్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన నున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇటీవలే చర్లపల్లి రెండవ ప్రవేశ ద్వారం, నూతన రైల్వే టెర్మినల్ అభివృద్ధి పనులు రూ. 413 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర ప్రాంతాలకు సంబందించిన రైళ్లు, మూడు ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి జంట నగరాలకు పశ్చిమాన లింగంపల్లిని మరో టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ఇదే దృక్పథంతో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను మరో శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. హైదరాబాద్ కి తూర్పు భాగాన ఉన్న చర్లపల్లి స్టేషన్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండి సౌకర్యవంతంగా ఉంది.

అందువల్ల ఈ చర్లపల్లి స్టేషన్ ను టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి గుర్తించారు. తద్వారా జంట నగర ప్రాంతంలో ఉన్న ఇతర రైలు టెర్మినల్స్‌లో రద్దీని తగ్గించడమే కాకుండా, ముఖ్యంగా నగరం తూర్పు ప్రాంత ప్రయాణీకులకు ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశ ద్వారం, నూతన రైల్వే టెర్మినల్ నిర్మించబడింది. స్టేషన్ భవనంలో ఆరు బుకింగ్ కౌంటర్లు, స్త్రీ, పురుషుల కోసం వేరు వేరుగా వేచియుండు గదులు, ఉన్నత తరగతి వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉన్నాయి. అదనంగా మొదటి అంతస్తులో కేఫెటెరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదుల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. నూతనంగా నిర్మించిన ఈ స్టేషన్ లో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు, ప్రకాశవంతమైన ప్రవేశ ద్వారం లైటింగ్‌తో ఆధునాతనంగా తీర్చిదిద్దిన ఎలివేషన్ ఉంటుంది. ఒక ప్లాట్‌ఫామ్ నుండి మరొక ప్లాట్‌ఫామ్ కు ఇబ్బందిలేకుండా ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడానికి ఒకటి 12 మీటర్ల వెడల్పుతో మరొకటి 6 మీటర్ల వెడల్పు కలిగిన రెండు విశాలమైన పాదచారుల వంతెనలు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడానికి మొత్తం 9 ప్లాట్‌ఫామ్‌లు, 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులోనికి తేవడంజరిగింది. ఈ స్టేషన్‌లో రైళ్ల నిర్వహణకు కోచ్ డిపోను అధునాతన పద్దతిలో సువిశాలంగా నిర్మించారు.

చర్లపల్లి స్టేషన్ దాదాపు రూ.413 కోట్ల వ్యయంతో అనేక మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ అదనంగా 15 జతల రైళ్ల రోజువారీ నిర్వహణ (మెకానికల్, ఎలెక్ట్రికల్, అండర్ గేర్ చెకింగ్, కోచ్ లను శుభ్రపరచడం మొదలగు పనులు) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్‌లో 4 అదనపు హై-లెవల్ ప్లాట్‌ఫామ్స్ నిర్మించారు. ఇప్పటికే ఉన్న5 ప్లాట్‌ఫామ్స్ పూర్తి నిడివితో నిర్మించారు. తద్వారా పూర్తి సామర్ధ్యం గల అన్నీ రకాల రైళ్ల రాకపోకలకు అనువుగా ఉంటుంది. ఈ స్టేషన్ లో అదనంగా 10 లైన్‌లు అందుబాటులోకి రావడంతో మొత్తం 19 లైన్ల సామర్థాన్ని కలిగి ఉంటుంది.
స్టేషన్లో రానున్న ప్రధాన సౌకర్యాలు :
బస్ బేతో పాటు 4-వీలర్ పార్కింగ్, 3- వీలర్ పార్కింగ్, టూ-వీలర్ పార్కింగ్ కోసం సరిపడా స్థలం.
కోచ్‌లను తెలిపే సూచిక బోర్డులు, రైళ్ల రాకపోకలను తెలియజేసే సూచన బోర్డులు
పైకప్పుతో కూడిన ప్లాట్‌ఫారంలు
అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్
రైళ్ల పూర్తి వివరాల విషయ సూచికలు
24 గంటల సిసిటివి నిఘా
స్టేషన్ ప్రాంగణం నుండి అన్ని ప్లాట్‌ఫారంలను నేరుగా కలుపుతూ నూతనంగా నిర్మించిన 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News