Saturday, November 2, 2024

తీరు మారని పుజారా

- Advertisement -
- Advertisement -

Cheteshwar Pujara A series of failures

వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న నయా వాల్

కాన్పూర్: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్, మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారాను వరుస వైఫల్యాలు వీడడం లేదు. కొంత కాలంగా పుజారా ప్రతి సిరీస్‌లోనూ నిరాశ పరుస్తున్నాడు. ఎన్ని అవకాశాలు లభిస్తున్నా అతను మాత్రం తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోలేక పోతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో సహా పలు టెస్టు సిరీస్‌లలో పుజారా వైఫల్యం కొనసాగింది. తాజాగా న్యూజిలాండ్‌తో గురువారం ఆరంభమైన టెస్టు సిరీస్‌లో కూడా మరోసారి నిరాశ పరిచాడు. కోహ్లి, రాహుల్, రోహిత్ వంటి కీలక ఆటగాళ్లు లేని సమయంలో పుజారా జట్టుకు కీలకంగా మారాడు. అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. కానీ అతను మాత్రం తన బ్యాటింగ్ తీరును మార్చుకోలేదు. కనీసం 30 పరుగుల మార్క్‌ను కూడా చేరకుండానే వెనుదిరిగాడు. జట్టుకు అండగా నిలుస్తాడని భావించిన పుజారా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఇది టీమిండియాకు ప్రతికూల అంశంగా చెప్పాచ్చు. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు కీలక ఇన్నింగ్స్ ఆడి ఉండకపోతే భారత్ కచ్చితంగా ఇబ్బందుల్లో చిక్కుకునేదే.

ఎన్నో ఆశలు పెట్టుకున్న పుజారా ఇలా వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకప్పుడూ టెస్టుల్లో చటేశ్వర్ పుజారాకు ఎదురే ఉండేది కాదు. సొంత గడ్డపైనే కాకుండా విదేశీ సిరీస్‌లలో కూడా అత్యంత నిలకడైన ప్రదర్శన చేసేవాడు. దీంతో అతనికి నయా వాల్ అనే బిరుదు వచ్చింది. అంతేగాక రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పుజారా పేరు తెచ్చుకున్నాడు. కానీ రెండు మూడేళ్లుగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లలో పుజారా ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. అతను శతకం సాధించక ఇప్పటికే రెండేళ్లు గడిచి పోయాయి. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. టెస్టు క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా అతనికి పేరుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మొక్కువోని ధైర్యంతో ఆడుతూ జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించే బాధ్యత తనపై వేసుకునే వాడు. కానీ ఇటీవల జరుగుతున్న సిరీస్‌లలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. తనపై జట్టు పెట్టుకున్న ఆశలను ప్రతి సిరీస్‌లోనూ నీరు గారుస్తున్నాడు. ఒకప్పుడూ వరుస సెంచరీలతో హోరెత్తించిన పుజారా ప్రస్తుతం అర్ధ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేక పోతున్నాడు. ఇది అతని బ్యాటింగ్ వైఫల్యానికి నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. పుజారా బ్యాటింగ్ ఇలాగే ఉంటే అతనికి టెస్టు జట్టులో స్థానం కష్టమేనని వారు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, విహారి వంటి యువ ఆటగాళ్లవైపు సెలెక్టర్లు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే అయ్యర్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇది పుజారాకు ఒక హెచ్చరిక లాంటిదేనని చెప్పాలి. రానున్న మ్యాచుల్లో తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక పోతే పుజారా టీమిండియాలో చోటు కోల్పోవడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News