బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా అదరగొడుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. ఈ టెస్టులో కెఎల్ రాహుల్-యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా దిగి.. జట్టు భారీ స్కోరు సాధించడంలో సక్సెస్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన ఈ జోడి.. రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌కు 201 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి రావడంతో రెండో టెస్టులో ఓపెనింగ్ జోడీపై చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ చెతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ జోడితోనే భారత్ ఓపెనింగ్ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పుజారా తెలిపారు. రోహిత్ మూడో స్థానంలో రావాలని.. ఇక, శుభ్‌మన్ గిల్ కోలుకుని వస్తే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాలని సూచించారు. ఒకవేళ, కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్ చేయాలనుకుంటే రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని, గిల్ ను ఐదో స్థానంలో పంపాలని పుజారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కాగా, రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది.