పాతికేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితారెడ్డికి చేవెళ్ల లోక్‌సభ ఎన్నిక సవాల్‌గా మారనుంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ గడ్డపై విజయకేతనం ఎగురవేసిన గులాబీ జెండా మరోసారి రెపరెపలాడించి, తనకు తిరుగులేదని నిరూపించుకుంటారా…..కాంగ్రెస్, బిజెపి దూకుడును తట్టుకొని నిలబడతారా అన్న చర్చ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో చేవెళ్ల బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం రంజిత్ రెడ్డి విజయం కోసం సబితారెడ్డి పక్కా ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో గులాబీ
దళం విజయకేతనం ఎగరవేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో రంజిత్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థిగా మారడంతో పాటు రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన అనంతరం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కావడంతో గులాబీ దళానికి కష్టకాలం ప్రారంభమైంది.
మహేశ్వరం ఎంఎల్‌ఎపై కాసాని గెలుపు బాధ్యత, కాంగ్రెస్, బిజెపిని తట్టుకొని నిలబడతారా..సొంత ఎంఎల్‌ఎలు సహకరిస్తారా..
2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు ఉండగా నేడు వికారాబాద్ జిల్లాలోని మూడు స్థానాలు హస్తం చేతిలో…రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు గులాబీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అన్నీ తామై ముందుండి హడావిడి చేసిన నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగుతూ హస్తం గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ అభ్యర్థి తరపున నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలలో పాల్గొంటున్న నేతలు సైతం ఎప్పుడు కారు దిగిపారిపోతారో ఎవరికీ అంతుపట్టని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జిగా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండటంతో గులాబీ నేతలను కాంగ్రెస్‌లో కలుపుకోవడానికి ఇప్పటికే గేట్లు తెరిచారు.
సబితారెడ్డి లక్షంగా శత్రుశేషం అంతా ఒక్కటై సొంత నియోజకవర్గం మహేశ్వరంలో సైతం సబితమ్మను టార్గెట్ చేసి హస్తం పార్టీ మెజారిటీ దక్కించుకోవడానికి మాజీ ఎంఎల్‌ఎలు కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి, తీగల కృష్ణారెడ్డితో పాటు జడ్‌పి చైర్‌పర్సన్ అనితారెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో పాటు చాలామంది నేతలు రంగంలోకి దిగారు.సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థులను తట్టుకుని మెజారిటీ సాధించడం కష్టంగా మారిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బాధ్యతలు సైతం మోయడం సబితారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు సవాల్‌గా మారింది.
నలుగురు శాసనసభ్యులు బిఆర్‌ఎస్ వారే అయినా వారు ఎంతవరకు సహకరిస్తారు…ఎప్పటివరకు పార్టీలో కొనసాగుతారో అన్నీ అనుమానాలే. చేవెళ్ల, రాజేంద్రనగర్ శాసనసభ్యులు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డిని కలవగా మరో శాసనసభ్యుడు సైతం సిఎంతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి రంజిత్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో కొనసాగిన సమయంలో ప్రస్తుత శాసనసభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు చాలామంది ఆయనతో సఖ్యతగా ఉండటంతో పాటు పలు రకాలుగా లబ్ధ్దిపొందినవారే కావడంతో వారు పరోక్షంగా ఆయకు సహకరించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
సిఎం రంగంలోకి దిగితే..
సిఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే సబితారెడ్డి మనుషులు చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల సమరభేరి తుక్కుగూడలో నిర్వహించిన మాదిరిగానే వచ్చే నెల మొదటివారంలో సబితారెడ్డి నియోజకవర్గంలోని తుక్కుగూడలోనే కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించనుంది. చేవెళ్ల సెంటిమెంట్‌గా కాంగ్రెస్ ప్రచారం ప్రారంభిస్తే సబితారెడ్డి కోట బీటలు వారడం ఖాయం. బిజెపి నేతలు సైతం సబితారెడ్డి టార్గ్గెట్‌గా రాజకీయం నడపడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బిజెపి దూకుడును తట్టుకొని బిఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి సబితారెడ్డి తన సత్తా చాటుకుంటారా… పోరులో చేతులెత్తేస్తారా అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. కాసాని గెలుపు సబితమ్మ రాజకీయ భవిష్యత్ సైతం ఆధారపడి ఉండే అవకాశం ఉందని, బిఆర్‌ఎస్ గెలిస్తే జిల్లాలో సబితారెడ్డి తిరుగులేదని ప్రచారం జరుగుతోంది.