పెన్సిల్వేనియా శాస్త్రవేత్తల తయారీ
వాషింగ్టన్ : కొవిడ్ వైరస్‌కు ఉచ్చు బిగించి అడ్డుకోగల చూయింగ్ గమ్ ను అమెరికా లోని పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. మొక్కల నుంచి లభించే ప్రొటీన్ పూత గల ఈ చూయంగ్ గమ్ లాలాజలంలో కొవిడ్ వైరస్ ప్రసారాన్ని చాలా వరకు తగ్గిస్తుందని, తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని పరిశోధకులు వివరించారు. పూర్తిగా టీకా పొందినప్పటికీ మళ్లీ కరోనా ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంటుందని, టీకా పొందని వారిలో ఏ విధంగా వైరస్ వ్యాపించి ఉంటుందో వీరిలో కూడా మళ్లీ వ్యాపించి ఉండవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
లాలాజల గ్రంధుల్లో కొవిడ్ ప్రతిరూపాలు ఉంటుంటాయని, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, లేదా మాట్లాడినా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్త హెన్నీ డేనియల్ వివరించారు. ఈ చూయింగ్ గమ్ లాలాజలంలో వైరస్‌ను తటస్థీకరించడానికి దోహదం చేస్తుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి ఇది సులువైన మార్గంగా పేర్కొన్నారు. కరోనా మహమ్మారి రాక ముందు డేనియల్ రక్తపోటు ను తగ్గించే చికిత్సలో భాగంగా యాంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైమ్ 2 (ఎసిఇ 2 ) ప్రొటీనుపై అధ్యయనం చేశారు. ఆయన స్వంత ల్యాబ్ లోనే ఈ ప్రొటీన్‌ను అభివృద్ధి చేశారు. మానవ కణాల్లో ఈ ఎసిఇ2 గ్రాహకం కొవిడ్స్పైక్ ప్రొటీన్‌ను కూడా గ్రహిస్తుందని కనుగొన్నారు. ఇదివరకటి అధ్యయనంలో ఎసిఇ 2 ఇంజెక్షన్లు వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తాయని తేలింది.