Monday, January 20, 2025

రైతు నేస్తం ఛత్రపతి శివాజీ … రైతు శత్రువు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

శివాజీ స్ఫూర్తితో రైతు వ్యతిరేక మోడీపై తిరుగుబాటు చేద్దాం: సిపిఐ నారాయణ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోడీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలనా కొనసాగిస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ ఆరోపించారు. చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్, హిమాయత్ నగర్, మగ్ధుంభవన్‌లో సోమవారం సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో చారిత్రక ఛత్రపతి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా డా. కె. నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఏం. బాల నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శి బి. స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి తదితరులు చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించి డా. కె. నారాయణ మాట్లాడుతూ నాలుగు వందల సంవత్సరాల క్రితం రైతుల సంక్షేమం వారి ప్రయోజనాల కోసం చత్రపతి శివాజీ అనేక సంస్కరణలు తన పరిపాలనలో తీసుకురావడం జరిగిందని, తన రాజ్యంలోని రైతులను నేరుగా పిలిపించి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని భూస్వామ భయంకర వ్యవస్థ కొనసాగిస్తున్న పద్ధతులను తొలగించి నూతన రెవెన్యూ వ్యవస్థను నెలకొల్పడం జరిగిందని, రైతులు పండించిన పంట దిగుబడి ఆధారంగా ఆ పంట యొక్క విస్తీర్ణాన్ని కొలిచి తద్వారా మాత్రమే పన్నులు వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేసారు. నేడు అధికారంలో కొనసాగుతున్న మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాల పైన గతంలో మూడు చట్టాలను రద్దు చేసే వరకు రైతులు దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేసి ఒక చరిత్రను సృష్టించడం జరిగిందన్నారు.

రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తానని పార్లమెంటులో ప్రగల్బాలు పలికిన మోడీ అనంతరం హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేసాడని మండిపడ్డారు. రైతులు తిరిగి రైతులు తమ హక్కులను సాధించుకోవడానికి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారని, రాజధానికి బయలుదేరిన రైతులను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ హైవే లను మేకులతో, పోలీసు సైన్యం పహారాల మధ్య ఢిల్లీ బార్డర్లను ప్రభుత్వం దిగ్బందించడం సిగ్గుచేటన్నారు. అయినా రైతులు వాటన్నిటిని ప్రతిఘటిస్తూ ముందుకు వస్తున్న రైతులపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాసు, బాష్పవాయు గోళాలు ప్రయోగించడమే కాకుండా డ్రోన్ల సహాయంతో పిల్లేట్లను వదులుతూ లాఠీ చార్జీలు చేస్తూ రైతులను గాయపరుచడం దుర్మాగమన్నారు.

కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని చత్రపతి శివాజీ భూస్వాములపై చేసిన తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకొని తమ హక్కులను సాధించుకోవడానికి రైతాంగం సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ప్రజలకు అన్నం పెడుతున్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ప్రజాస్వామిక వాదుల పైన ఉన్నదని డా. కె. నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, కంపల్లి శ్రీనివాస్, ఒమర్ ఖాన్, నగర నేతలు సిహెచ్. జంగయ్య, షంషుద్దీన్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News