Monday, December 23, 2024

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ప్రచారం పరిసమాప్తం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. చివరిరోజున అధికార, విపక్షాలు ముమ్మరంగా ప్రచారం సాగించాయి. మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడతలోని 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ పూర్తయింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీతోపాటు కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ , కాంగ్రెస్ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్‌గఢ్ లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17 ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

మొత్తం 230 స్థానాలకు 5.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా, 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36 లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. చివరిరోజు ముమ్మరంగా ప్రచారం సాగించిన మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు …
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండో దశలో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 1.63 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. దీనికోసం 18,883 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ , ప్రియాంక గాంధీ వాద్రాలు ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ తరఫున అమిత్ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్ ఠాకూర్ తదితర నేతలు చివరిరోజు ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ బెమెతరా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కులగణనను మరోసారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News