Friday, December 20, 2024

చత్తీస్ పిఎఫ్ సొమ్ము మాయం

- Advertisement -
- Advertisement -

చత్తీస్ పిఎఫ్ సొమ్ము మాయం
అదానీ ఖాతాలో చేరితే పెన్షనర్లకు ముప్పే
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆందోళన
పింఛన్ సొమ్ము దారిమళ్లితే దారుణమే
రాంచీ: అదానీ గ్రూప్ సంస్థల్లోకి చివరికి జాతీయ పింఛన్ పథకం సొమ్ము కూడా డిపాజిట్ చేశారనే అనుమానాలు వస్తున్నాయని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తెలిపారు. ఓ వైపు ఎల్‌ఐసి, ఎస్‌బిఐ వంటి ప్రధాన సంస్థల వేల కోట్ల ధనం అదానీ పాలయింది. అక్రమాలు జరిగినట్లు విమర్శలు తలెత్తినా ఇప్పటికీ ఆయా సంస్థల నుంచి నిధులు పతనం చెందుతున్న అదానీ కంపెనీలలోకి వచ్చిపడుతున్నాయని బఘేల్ ఆందోళన వ్యక్తం చేశారు.

హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ షేర్లు భారీగా పతనం చెందిన దశలోనూ ఎస్‌బిఐ, ఎల్‌ఐసి నిధులు ఈ కంపెనీలకు చేరడం అనుచితం అని పేర్కొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు పింఛన్ సొమ్ము కూడా అదానీ ఖజానాకు చేరితే అది కలవరం కల్గించే అంశం అవుతుందన్నారు. ఎన్‌పిఎస్ డబ్బు రిటైర్ అయిన వారికి జీవిత చరమాంకంలో ఎంతో కొంత ఉపయోగపడుతుంది. దీనికి అదానీ ద్వారా కేంద్రం గండి కొడితే ఆ వృద్ధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్ నివేదిక గురించి మాట్లాడితే బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కొందరు నేతలు భావిస్తున్నారని, పైగా ఈ మాటలకు దిగిన వారిని హిందూ వ్యతిరేకులు అంటున్నారని వ్యాఖ్యానించారు.

తప్పులు జరిగితే వాటిని లేవనెత్తితే మోడీ, అమిత్ షా వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. తమపై వస్తున్న విమర్శలను అదానీ వర్గాలు భారత్ వ్యతిరేక మాటలని కొట్టిపారేస్తున్నారు. దేశానికి నష్టం కల్గితే మాట్లాడితే తప్పవుతుందా? అని బఘేల్ ప్రశ్నించారు. నిజానికి ఎవరు భారత్, అదానీ జీ భారతా అని సిఎం నిలదీశారు. తాను ఎన్‌పిస్ నిధులను అదానీ సంస్థలలోకి మళ్లించి ఉంటారని చెప్పడానికి కారణం ఉందని బఘేల్ తెలిపారు. రాష్ట్రంలోపాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్‌పిఎస్‌లో డిపాజిట్ చేసి ఉంచిన రూ.17000 కోట్ల వాపసీకి డిమాండ్ చేసిందని, అయితే ఇంతవరకూ ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఇప్పుడు తనకు వస్తున్న అనుమానం ఏమిటంటే ఈ భారీ సొమ్ము, అదీ పింఛన్‌దార్లకు చెందిన డబ్బును కేంద్రం ఏదో విధంగా అదానీ సంస్థల్లోకి మళ్లించి ఉంటుందా? అనేదే అని, ఇది నిజమైతే ఇంతకు మించి కలవరం కల్గించే అంశం మరోటి లేదని పేర్కొన్న బఘేల్ దీనిపై నిజాలు తేలాల్సి ఉందన్నారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, యుటిఐలు నిధుల నిర్వాహకులు. ఇప్పుడు యావత్తూ షేర్ మార్కెట్ పతనం చెందిన దశలో ఎల్‌ఐసి కూడా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టినట్లు, భారీగా షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిసిందని, ఇక ముప్పు ఏ స్థాయిలో ఉందనేది విదితం అవుతోంది కదా అని వ్యాఖ్యానించారు. అదానీ సంస్థల్లోకి భారీగా ప్రజా ధనం పెట్టుబడులపై భారత ప్రభుత్వం నుంచి వివరణ కావాలని, ఆర్థిక నిపుణులు కూడా ఇప్పటి స్థితిపై స్పందించాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News