ఆత్మహత్యకు ముందు తోబుట్టువులపై దాడి
బస్తర్: ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో 32 ఏళ్ల వ్యాపార వేత్త తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో కలత చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన సోదరుడు, సోదరిని కూడా చంపడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. టోకపాల్ బ్లాక్ పరిధిలోని అరపూర్ బస్తీలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఓపీ శర్మ తెలిపారు. సురేంద్ర కుచ్‌గా పిలవబడే ఈ వ్యక్తి రిటైర్డ్ సేల్స్ ట్యాక్స్ అధికారి కుమారుడు, కాంగ్రెస్ ఎంఎల్‌ఏ బంధువు అని తెలుస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం, వ్యాపారంలో నష్టాల కారణంగా కలత చెందాడని ఓ అధికారి తెలిపారు. అతను తన తల్లి రాధిక (75)ని పదునైన ఆయుధంతో హతమార్చాడని, ఆత్మహత్యకు ముందు తన సోదరుడు, సోదరిపై కూడా దాడి చేశాడని పోలీసులు వివరించారు. దాడిలో అతని తోబుట్టువులు గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.