Saturday, November 16, 2024

రాయ్‌పూర్ రాజకీయం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: మహారాష్ట్రలో శివసేన శాసనసభా పక్షాన్ని మూలమట్టంగా పెకలించి వేసి మహా వికాస్ అగాధి (శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్) కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ దేనికైనా తెగించగలదనే అభిప్రాయం మరింత గట్టిపడింది. బిజెపియేతర పాలక పక్షాల్లో లుకలుకలు సాగుతున్న రాష్ట్రాలు యిందుకు అనువైనవి కావడం సహజం.ఈ దృష్టితో చూసినప్పుడు సహజంగా చత్తీస్‌గఢ్ అందరి కళ్లల్లో పడడం సహజం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, సీనియర్ మంత్రి టిఎస్ సింగ్ దేవో మధ్య చిరకాలంగా వున్న ఆధిపత్య పోరు తాజాగా మళ్ళీ భగ్గుమనడమే యిందుకు కారణం. సింగ్ దేవో యీ నెల 16 తేదీన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిపై గల వ్యతిరేకతను మరోసారి స్పష్టంగా వ్యక్తం చేశారు.

అయితే ఆయన తన వద్ద గల ఆరోగ్య తదితర వ్యవహారాల మంత్రిగా మాత్రం క్యాబినెట్‌లో కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాను శాసనసభలో ప్రతిపక్షాలతో వాగ్వాదం తర్వాత నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆమోదించారు. భగేల్, సింగ్ దేవో మధ్య అధికారం కోసం పోరు చిరకాలం గా సాగుతున్నది. చత్తీస్‌గఢ్‌లో 2018 యెన్నికల తర్వాత పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాలని కుదిరినట్టు చెబుతున్న వొప్పందాన్ని ఉల్లంఘించి భగేల్ అధికారంలో కొనసాగుతున్నారన్నది సింగ్ దేవో ఆరోపణ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పేదలకు మంజూరైన రెండు లక్షల యిళ్లను నిర్మించకపోడం పట్ల నిరసనగా తప్పుకొంటున్నట్టు సింగ్ దేవో తన రాజీనామా లేఖలో వెల్లడించారు. తమ ప్రభుత్వం పేదలకు వొక్క యింటినైనా నిర్మించలేదని ఆరోపించారు. ఇటీవలే చత్తీస్‌గఢ్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా యిదే ఆరోపణ చేశారు. అయినప్పటికీ భగేల్ మంత్రివర్గం నుంచి పూర్తిగా వైదొలగడానికి సింగ్ దేవో తొందరపడకపోవచ్చు.

కాని బిజెపి కూల్చివేత పన్నాగం రాటు దేలితే యేమైనా జరగవచ్చు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90 మంది సభ్యులున్నారు. గత శాసనసభ యెన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలలో విజయం సాధించింది. బిజెపి 15, జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ (జె) 3, బహుజన సమాజ్ పార్టీ 2 గెలుచుకొన్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ మరింత బలపడింది. విచిత్రంగా చత్తీస్‌గఢ్ రాజకీయంపై కాంగ్రెస్ అధిష్టానంలోనూ ఏకీభావం లేదు. సోనియా గాంధీ ముఖ్యమంత్రి భగేల్‌ను సమర్ధిస్తుంటే, మంత్రి సింగ్ దేవోకు రాహుల్ గాంధీ మద్దతు యిస్తున్నట్టు చెబుతారు. భగేల్ సారథ్యంలో పాలన సమర్ధవంతంగా సాగుతున్నదనే అభిప్రాయం నెలకొని వున్నది. యెన్నికలు యేడాదిన్నర సమీపంలో వుండగా ముఖ్యమంత్రిని మార్చడం కాంగ్రెస్‌కు మంచి చేయకపోవచ్చు. చత్తీస్‌గఢ్‌లో 15 సంవత్సరాల తర్వాత 2018 డిసెంబర్ యెన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో జరిగిన నాలుగు శాసనసభ స్థానాల ఉపయెన్నికల్లోనూ గెలిచింది.

ముఖ్యంగా గత యేప్రిల్‌లో జరిగిన ఖైరాగఢ్ వుపయెన్నిక చెప్పుకోదగినది. వాస్తవానికి యీ శాసనసభ స్థానం అంతకు ముందు కాంగ్రెస్, బిజెపిలలో యే పార్టీకీ చెందినది కాదు. మాజీ ముఖ్యమంత్రి కీ.శే అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ (జెసిసి) ఎమ్‌ఎల్‌ఎ దేవ్త్ సింగ్ గత నవంబర్‌లో మృతి చెందడంతో ఖాళీ యేర్పడి అక్కడ ఉపయెన్నిక అవసరమైంది. ఈ యెన్నికలో బిజెపి అభ్యర్థిగా మాజీ ఎమ్‌ఎల్‌ఎ కోమల్ జంగల్ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి యశోద వర్మ 20,000 వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఖైరాగఢ్‌ను ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రకటించడంతో బాటు ముఖ్యమంత్రి భగేల్ మరికొన్ని తెలివైన నిర్ణయాలు తీసుకోడం వల్ల యీ విజయం సాధ్యమైందనుకొన్నారు. రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు వుపయోగపడే రెండు బొగ్గు గనులకు అనుమతించే విషయంలో కొనసాగుతున్న వివాదంలో యే నిర్ణయం తీసుకొంటారనేదీ కాంగ్రెస్ భవితవ్యంపై ప్రభావం చూపవచ్చు.

సర్గుజా రాజవంశ వారసుడైన మంత్రి సింగ్ దేవో నియోజకవర్గం సర్గుజా భూభాగంలో వున్న యీ రెండు గనుల తవ్వకానికి భగేల్ ప్రభుత్వం యిప్పటికే తుది అనుమతులు యిచ్చేసింది. కాని రెండు లక్షల చెట్లు కూల్చి వేయబోడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టడంతో ప్రతిష్టంభన యేర్పడింది. రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రతిష్ఠతో ముడిపడిన యీ గనులపై నిర్ణయ బాధ్యత యిప్పుడు పార్టీ అధిష్టానంపై పడింది. ఎందుకంటే స్థానికుల ఆందోళనకు మంత్రి సింగ్ దేవో మద్దతు యిస్తున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో, అంతిమంగా ముఖ్యమంత్రికి, తిరగబడ్డ సీనియర్ మంత్రికి మధ్య మరోసారి రాజీ కుదర్చడంలో పార్టీ కేంద్ర నాయకత్వం యెంతవరకు విజయవంతం కాగలుగుతుందో చూడాలి. ఇందులో విఫలమై అపరిణత నిర్ణయాలు తీసుకొంటే పంజాబ్ తర్వాత కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని కోల్పోయింది అవుతుంది. అంతర్గత కలహాలు కాంగ్రెస్‌ను దెబ్బ తీసినంతగా యింకే పార్టీనీ నష్టపరచ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News