Thursday, December 19, 2024

ప్రతిభావంతులైన విద్యార్థులకు హెలికాప్టర్‌లో ‘ఆనంద విహారం’

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: పదోతరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యంత ప్రతిభతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హెలికాప్టర్‌లో ఆనందంగా విహరించే అవకాశం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కల్పించింది. పదోతరగతిలో 89 మంది టాపర్‌లకు, 12 బోర్డు పరీక్షల్లో 10 మంది విద్యార్థులకు ఈ అవకాశం లభించింది. వీరిలో పదోతరగతిలో 88.16 శాతం మార్కులు తెచ్చుకున్న ఎన్.కుమారి బైగా అనే బాలిక శనివారం హెలికాప్టర్ లో “ఆనంద విహారం” (జాయ్‌రైడ్) సాగించింది.

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఏడు సీట్ల హెలికాప్టర్‌లో కొంతసేపు ప్రయాణించింది. ప్రత్యేక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన బైగా కబిర్ధమ్ జిల్లా మన్నాబేడీ గ్రామానికి చెందినది. అదే జిల్లా బోడియా లోని స్వామీ ఆత్మానంద్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూలులో పదోతరగతి చదివింది. అతిసామాన్య కుటుంబానికి చెందిన బైగా తల్లి అదే గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తోంది. బైగా హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది. మేం ఆరుగురు పిల్లలం. “మా పెద్దక్క హెలికాప్టర్‌లో విహారం కోసం రాయ్‌పూర్‌కు నన్ను తీసుకువచ్చింది. నాజీవితంలో ఈరోజు మరువరానిది.

చాపర్‌లో ప్రయాణిస్తానని తాను కలలో కూడా అనుకోలేదు. ప్రత్యేక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన దానిని కాబట్టి తమ సమాజం పురోగతి కోసం కృషి చేస్తాను ”అని తన భావోద్వేగాన్ని వెల్లడించింది. డాక్టర్ కావాలన్నదే తన కోరికగా పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతిగా హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గత ఏడాది వెల్లడించారు. ఈమేరకు “ స్వామీ ఆత్మానంద్ మేథావి ఛాత్రా ప్రోత్సాహన్ యోజన” అనే పథకాన్ని అమలు చేశారు. గత ఏడాది ప్రతిభావంతులైన విద్యార్థులు 125 మంది హెలికాప్టర్‌లో ఆనంద విహారం చేశారు. ఈ ఏడాది పదోతరగతికి చెందిన 49 మందిని, 12 వ తరగతికి చెందిన 30 మందిని ఎంపిక చేశారు. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 10 మంది విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News