Wednesday, January 22, 2025

ఆగష్టు 16న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగష్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పురాణ ప్రాశస్త్యం

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఛత్రస్థాపనోత్సవం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.

అక్కడినుండి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News