హైదరాబాద్: గత ఆరు నెలలో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర ఒక్కసారిగా రూ.259కి చేరువైంది. పదిరోజుల క్రితం రూ.190 రూపాయలు ఉన్న చికెన్ ధర అమాంతంగా పెరిగిపోయింది. మరోవైపు గుడ్డుతో సరిపెట్టుకుందామనుకున్నా గుడ్డు ధర కూడా రూ.5కి చేరింది. కొండెక్కిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయన్నమాట. ఓ వైపు నిత్యావసరాలైన కూరగాయలు, పప్పులు ఆకాశాన్నంటుతుంటే.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ప్రజలు వాపోతున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో చికెన్ వినియోగం కొంతకాలంగా 50 నుంచి 60 శాతం మేర పడిపోయి ఓ దశలో కిలో వందకే లభ్యమైంది.
ప్రస్తుతం వినియోగం పెరగడం, ఎండలు మండిపోతున్న తరుణంలో కోళ్ల దిగుమతి తగ్గిపోయింందని, అందుకే ధర పలుకుతోందని వ్యాపారుల మాటగా వినవస్తోంది. వడగాల్పుల తీవ్రతకు పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు చనిపోవడం, ఎండల తీవ్రత వల్ల చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశముందని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో కిలో చికెన్ ధర రూ.300 వరకు వెళ్లే అవకాశం ఉందని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. ఇలా అయితే చికెన్ తినడం కష్టమేనని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. కోవిడ్, బర్డ్ ఫ్లూ ప్రచారంతో పౌల్ట్రీ యజమానులు చాలా వరకు కోళ్ళ ఉత్పత్తిని నిలిపివేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నామని పౌల్ట్రీ యజామానులు చెబుతున్నారు.
డిమాండ్ అధికంగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. కోళ్ల దాణా, నిర్వహణ వ్యయం పెరగడంతో పాటు వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీల్లో కోళ్లు చనిపోవడంతో చికెన్ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. రేట్లు పెరగడంతో ప్రజలు చికెన్ కొనడానికి ఆసక్తి కనబర్చడం లేదు. చికెన్ ధరకు వంద కలిపితే ఆఫ్ కేజీ మటన్ వస్తుందని అంటున్నారు. కాగా, గతంలో వారానికి 20 క్వింటాళ్ల చికెన్ వ్యాపారం జరిగేదని, రేట్లు పెరగడంతో పది క్వింటాళ్లు కూడా అమ్మడం లేదు. రేట్లు పెరగడంతో వ్యాపారం తగ్గిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు.