తగ్గిన చికెన్, కోడిగుడ్ల ధరలు
అమాంతం పెరిగిన మటన్ రేటు
కిలో రూ.1,000 వరకు అమ్మిన
వ్యాపారులు చేపలు, రొయ్యల
ధరలు పైపైకే.. మాంసం ప్రియుల
జేబులకు చిల్లు మటన్ షాపుల
వద్ద బారులు తీరిన జనం
వెలవెలబోయిన చికెన్
దుకాణాలు పౌల్ట్రీ రంగాన్ని
కుదిపేస్తున్న మహమ్మారి
సంక్షేమ హాస్టళ్లలో చికెన్ మెనూ
నిలిపివేత
మన తెలంగాణ/హైదరాబాద్: బర్డ్ ఫ్లూ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. ఆదివారం పూట కిటకిటలాడే చికెన్ సెంటర్లు మాత్రం వెలవెలబోయాయి. అయినప్పటికీ చికెన్ ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రతీ ఆదివారం బిజీబిజీగా గడిపే చికెన్ సెంటర్ వ్యాపారులు ఈ వారం ఖాళీగా కనిపిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినడానికి ధైర్యం చేయడంలేదు. ఆదివారం కావడంతో మటన్, చే పలు కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా బర్డ్ ఫ్లూ రావడంతో చికెన్ ధరలు చతికిలబడ్డాయి. పోనీ ధరలు తగ్గాయి..కదా మంచిగా చికెన్ కొనుగోలు చేసి ఫుల్‌గా తిందామనుకున్న మాంసాహార ప్రియులకూ అవకాశం దక్కలేదు. ఒక వైపు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ షా పులపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో రెండు వారాల నుంచి ప్రజలకు చికెన్ అందుబాటులోకి లేకుండా పోయింది.
మరోవైపు బర్డ్ ఫ్లూ ప్రభావం లేని చోట చికెన్ కొనుగోలు దుకాణాలు తెరచినా మాంసాహార ప్రియులు ముందుకు రా వడం లేదు. చికెన్ ధరలను తగ్గించి అమ్ముతున్నా వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్నారు. ఆదివారం సైతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ దుకాణాలు వెలవెల బోయాయి. ప్రతి ఆదివారం ఎగబడి కొనుగోలు చేసే వారంతా ఉన్న పళంగా తగ్గిపోవడంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నా రు. మార్కెట్‌లో ప్రస్తుతం చికెన్ ధర రూ.150కి అమాంతంగా పడిపోయింది. కొన్ని చోట్ల రూ.100కే అమ్మారు. ఇదే అదునుగా మటన్ ధరలు మండిపోతున్నాయి. బర్డ్ ప్లూ కారణంగా మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఆయా దుకాణాలకు సరిపడా కోళ్లు లేకపోవడంతో వ్యాపారస్తుల పరిస్థితి దయనీయంగా మారింది. బర్డ్ ఫ్లూ లేని ప్రాంతాల్లోనే చికెన్‌ను విక్రయిస్తున్నారు. చికెన్‌ను ప్రజలు తినవచ్చని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజలు భయాందోళనతో వాటిని తినడం మానేశారు.
ఈ రెండు కారణాలతో 70 శాతం చికెన్ విక్రయాలు తగ్గిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో మాంసాహారులు అంతా చేపలు, రొయ్యలు, మటన్‌పై మోజు పడుతున్నారు. మార్కెట్లో చేపలు, రొయ్యలు, మటన్ కొనుగోలు చేస్తున్నారు. చేపలు, రొయ్యల మార్కెట్లు రద్దీగా మారాయి. చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటంలేదు. ఇంతకుముందు మార్కెట్‌లో కిలో రూ.800 ఉన్న మటన్ ధర ఇప్పుడు ఏకంగా కిలో వెయ్యి రూపాయలకు చేరిపోయింది. ఇక చేసేదేమీ లేక మాంసాహారులు మటన్ వైపు చూస్తున్నారు. గతంలో కిలో కొన్న వారంతా ఇప్పుడు దాన్ని అర కిలోకు, గతంలో రెండు కిలోలు కొనుగోలు చేసిన వారు తాజాగా కిలోకు తగ్గి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మటన్ దుకాణాల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. చేపల ధరలు కూడా కిలో 400 రూపాయలకు చేరాయి. ఇక సాధారణ రొయ్యలు కిలో 900 రూపాయలు పలుకుతున్నాయి. చికెన్‌ను ప్రతి వారం కొనుగోలు చేసే మధ్యతరగతి వర్గాలంతా మటన్‌ను కొనలేక మౌనంగా ఉండిపోతున్నారు.
చేపలు…మటన్ షాపుల వద్ద జనం క్యూ
బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొంతమంది ప్రజలు చికెన్ తినేయడం మానేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చేపలు, మటన్ షాపుల వద్ద జనం క్యూ కట్టారు. దీంతో చికెన్ వ్యాపారులు కస్టమర్లు లేక దుకాణాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. మరోవైపు చేపలు, మటన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో చేపల రేట్లు ఒక్కసారిగా పెంచి అందినకాడికి వ్యాపారులు స్వాహా చేస్తున్నారు . గతంలో కిలో మటన్ ధర రూ.700 నుంచి 800కు విక్రయించేవారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారు. మాంసం ప్రియులు ఏమీ చేయలేక కొనుగోలు చేస్తున్నారు. అలాగే చేపల రేట్లను కూడా పెంచి విక్రయిస్తున్నారు. రూ.150 నుంచి 160కు అమ్మే బొచ్చ, రవ్వ రకం చేపలను ఏకంగా రూ.200 కేజీగా అమ్ముతున్నారు. మధ్య తరగతి కుటుంబాలపై ఈ ధరలు ప్రభావం చూపుతున్నా యి. సంక్షేమ హాస్టళ్లల్లో చికెన్ మెనూ ఉన్న రోజు దాన్ని నిలిపివేసి శాఖాహార పదార్థాలను అందించాలని అధికారులు ఆదేశించారు.
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే లక్షణాలివీ
యాదృచ్ఛికంగా బర్డ్ ఫ్లూ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలిలా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడిదగ్గు రావచ్చు. తలనొప్పితో అలసటగా ఉంటుంది. శరీరమంతా నొప్పి, గందరగోళం, తీవ్ర అలసట అనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పితోపాటు కొంత మందికి మలబద్ధకం లేదా వాంతులు, విరేచనాలు కనిపించవచ్చు. శరీరమంతా కండరాల నొప్పితో బాధపడవచ్చని వై ద్యులు అంటున్నారు. కళ్ళు ఎర్రబడటం, నీరు కా రడం వంటి లక్షణాలు రావచ్చు.చికెన్ తినేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదు. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టగా ప్రజలు మాత్రం మటన్‌తో పాటు సీ ఫుడ్‌పై ఆసక్తి చూపుతున్నారు.
బర్డ్‌ఫ్లూ వ్యాధిపై తక్షణ రక్షణాత్మక చర్యలు అవశ్యం : మైక్రో బయాలజిస్టు ఎంవీ సుబ్బారావు
పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)నకు చికిత్స సాధ్యం కాదని, నివారణపైనే పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సి ఉం దని, అప్రమత్తతే ప్రధాన ఆయుధమని ప్రముఖ వెటర్నరీ మైక్రోబయాలజిస్ట్, బర్డ్‌ఫ్లూ నిపుణుడు మండవ వెంకట(ఎంవీ) సుబ్బారావు పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగాన్ని కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర సర్కారులు తక్షణమే కార్యరంగంలోకి దిగాలని ఆయన సూచించారు. మనదేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా 2004 నుంచి ఉందని, ఈసారి నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు త క్కువగా ఉండటం వల్ల కొన్నిచోట్ల వైరస్ ప్రభావం చూ పుతోందన్నారు. వైరస్ కారణంగా వస్తుందని, ఇది ము ఖ్యంగా పక్షులను ప్రభావితం చేస్తుందని, అయితే, జంతువులతో పాటు చేపలు, కుక్కలు, పందులకు, కొన్నిసార్లు మనుషులకూ సోకుతుందని వివరించారు.