హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చికెన్ ధరలు మండిపోతున్నాయి. చికెన్ ప్రియులు కోడి మాంసం కొనాలంటే బయపడుతున్నారు. ఇప్పుడు చికెన్ ధర ఏకంగా 300 రూపాయలకు పెరగడంతో తినడానికి చికెన్ ప్రియులు వెనకడుగు వేస్తున్నారు. పెరిగిన ఎండలతో పాటు కోళ్ల ఉత్పత్తి తగ్గిందని కోళ్ల ఫారాల యజమానులు చెబుతున్నారు. మేడారం జాతరలో కోళ్ల విక్రయాలు ఎక్కువ జరిగాయి. మరో పక్క బర్డ్ ఫ్లూతో కూడా కోళ్లు చనిపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. కోడి గుడ్డు ధర ఐదు రూపాయల నుంచి ఏకంగా ఏనిమిది రూపాయలు వరకు షాపులలో విక్రయిస్తున్నారు.
కార్తీక మాసం సందర్భంగా చికెన్ కిలో రూ.130 నుంచి రూ.140 కు అమ్ముడు పోవడంతో కోళ్ల ఫారాల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో కోళ్లను పెంచడం తగ్గించారు. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెట్ రేటు పెరిగింది. బుధ, గురువారాల్లో లైవ్ కోడి ధర రూ.150 నుంచి రూ.200లు ఉండగా ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.300 వరకు పెరిగింది. కిలో బోన్‌లెస్ చికెన్ ధర ప్రస్తుతం రూ.500గా మార్కెట్లో నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఆదివారం 12 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్ పండుగల సమయంలో రోజు 15 వేల నుంచి 16 వేల టన్నుల చికెన్ అమ్ముతుంటారు. చికెన్ ధర పెరగడంతో విక్రయాలు క్రమంగా తగ్గాయని షాపు యజమానులు చెబుతున్నారు.