- Advertisement -
కాంగ్రెస్ సీనియర్‌నేత చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా వినిపించిన వాదన ఆధారంగా స్పైవేర్‌ను వినియోగిస్తున్నట్టు ఒప్పుకున్నట్టేనని కాంగ్రెస్ సీనియర్‌నేత పి.చిదంబరం అన్నారు. ఓవేళ అది పెగాసస్ స్పైవేర్ అయితే ఏ ఉద్దేశంతో దానిని వినియోగించారో తెలుసుకోవాల్సి ఉన్నదని ఆయన అన్నారు. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి దేశంలోని ప్రముఖుల ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కేంద్రం తరఫున హాజరైన మెహతా..తన వాదన వినిపిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఏ స్పైవేర్‌ను వినియోగిస్తున్నది అఫిడవిట్ రూపంలో బహిర్గతం చేయలేమని చెప్పారు. ఆ విధంగా వెల్లడించడం వల్ల శత్రువులు మన నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు వీలు కల్పించినట్టవుతుందని మెహతా తన వాదన వినిపించడం గమనార్హం.
- Advertisement -