ఒక దేశం, ఒకే ఎన్నికలను ప్రతిపాదిస్తున్న కేంద్రంలోని బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఇది ఆచరణ సాధ్యం కాదని, ఇందుకోసం కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని ఆయన తెలిపారు. సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ ఆ రాజ్యాంగ సవరణలు చేసేఉందకు అవసరమైన సంఖ్యాబలం లోక్‌సభలో కాని రాజ్యాసభలో కాని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేవని అన్నారు. తరచు ఎన్నికలు జరుగుతుండడం వల్ల దేశ ప్రగతికి ఇది అవరోధాలు కల్పిస్తోందని, దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిచండం మంచిదంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటనను విలేకరులు ప్రస్తావిస్తూ ఈ ఐదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోడీ ఈ ప్రతిపాదనను ఆచరణసాధ్యం చేయగలరా అని ప్రశ్నించారు. దీనికి చిదంబరం జవాబిస్తూ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఒక దేశం, ఒకే ఎన్నికలు సాధ్యం కాదని అన్నారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ఇటీవల మోడీ చేసిన ఆరోపణ గురించి ప్రశ్నించగా ఆయన ఈ ఆరోపణను తోసిపుచ్చుతూ రిజర్వేషన్లను తాము ఎందుకు రద్దు చేస్తామని ఎదురు ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమిత్తిని తొలగించాలని తాము కోరుతున్నామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని తాము చెబుతున్నామని ఆయన చెప్పారు. ప్రధాని చెప్పే మాటలన్నీ నమ్మవద్దంటూ ఆయన విలేకరులకు హితవు పలికారు. అక్టోబర్‌లో హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సాధారణంగా ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించదని ఆయన చెప్పారు. ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలను సమావేశపరిచి వారి ప్రాధాన్యతలను పార్టీ అడిగి తెలుసుకుంటుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.
హర్యానాలో కూడా ఇదే సాంప్రదాయం కొనసాగుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే మేలు జరుగుతుందంటూ బిజెపి చేసే ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఒక ఇంజన్‌లో ఇంధనల ఏదని, మరో ఇంజన్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయిందని హర్యానాలోని బిజెపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నిస్తూ రెండు ఇంజన్లను మూలన పడేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు.