Wednesday, January 22, 2025

అతిథి ఎంపికలో మలుపులు!

- Advertisement -
- Advertisement -

రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్య అతిథి నిర్ణయ ఘట్టం ఈసారి ఊహించని మలుపులు తిరిగి అమెరికాతో మన సంబంధాలను మసకబారించాయా? ఈ ప్రశ్నకు కాదు అని గట్టిగా నిరాకరించలేని పరిస్థితి తలెత్తుతున్నది. అయితే ఇది ఊహిస్తున్నంత తీవ్రస్థాయిలో లేదని కొందరు నిపుణులు కొట్టి పారేస్తున్నప్పటికీ ఎంతో కొంత నిజం లేకపోలేదని మాత్రం అర్ధమవుతున్నది. ఏటా రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్య అతిథిని నిర్ణయించే ఘట్టం ఆరు మాసాల ముందు నుంచే మొదలవుతుంది. గత సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జి20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చినప్పుడు 2024 జనవరి 26 పండుగకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఇందుకు ఆయన రాలేకపోతున్నట్టు ఆ తర్వాత అమెరికా తెలియజేసింది.

దానితో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్‌ను ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించారు. ఫ్రాన్స్ అధినేతలు మన రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావడం ఇది ఆరవసారి. రాజ్యాంగాన్ని అమల్లో పెట్టుకొన్న అత్యంత ప్రాముఖ్యం కలిగిన రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరిని పిలవాలనేది ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశం. ఇండియాతో సన్నిహిత, ప్రత్యేక సంబంధాలు కలిగిన దేశాధినేతలనే ఇందుకు ఎంచుకొంటారు. బైడెన్‌ను ఆహ్వానించడం, ఆయన కాదనడం ఈ నేపథ్యంలో ఇండియాకు అసంతృప్తిని కలిగించే అంశమే. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన ఆహ్వానాన్ని తిరస్కరించిప్పుడు అందుకు విచారిస్తున్నామని అమెరికా తెలియజేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమైన వార్షిక ప్రసంగం చేయవలసి వున్నందునే బైడెన్ మన ఆహ్వానాన్ని మన్నించలేకపోయారని చెబుతున్నారు.

ఇందుకు భిన్నంగా 2015 రిపబ్లిక్ దినోత్సవానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. ఆ ఏడాది జనవరి 20 న ఒబామా తన వార్షిక ప్రసంగాన్ని ముగించారు. ముందుగా అనుకొన్న ప్రకారమైతే అమెరికా చొరవతో చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘క్వాడ్’ శిఖరాగ్ర సమావేశం కూడా న్యూఢిల్లీలో ఈ నెలలో జరగవలసి వుంది. బైడెన్ రిపబ్లిక్ దినోత్సవాలకు వచ్చి ఉంటే ఆ మరునాడు జనవరి 27న క్వాడ్‌ను జరపాలనుకొన్నారు. అందులోని ఇతర సభ్యదేశాలు జపాన్, ఆస్ట్రేలియాల ప్రధానులకు కుదరకపోడం వల్ల దానిని సైతం ఈ ఏడాది చివరికి వాయిదా వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నవంబర్‌లో జరగాలి.

బైడెన్ రాలేకపోడానికి దానిని కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. అమెరికా పౌరసత్వం గల ఖలిస్థాన్ వాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ను అక్కడే హత్య చేయడానికి భారత ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కుట్ర పన్నారని అమెరికా అధికారులు ఆరోపించిన తర్వాత రెండు దేశాల సంబంధాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతున్నట్టే అనిపించాయి. భారత ఆహ్వానాన్ని బైడెన్ మన్నించకపోడానికి ఇది కూడా ఒక కారణమేనని ఇప్పుడు వినవస్తున్నది. అంతకుముందు కెనడాలోని మరో సిక్కు తీవ్రవాది నిజ్జర్‌ను హత్య చేసింది భారతీయులేననే ఆరోపణ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణను ప్రధాని జిస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంటులోనే చేసి సంచలనం సృష్టించారు. దానితో భారత, -కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధం పరంగా భారత దేశం తటస్థ వైఖరి తీసుకోడం, రష్యాతో సత్సంబంధాలను చెదరనీయకుండా కాపాడుకోడం అమెరికాకు బొత్తిగా గిట్టడం లేదని తెలుస్తున్నది.

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పదేపదే ప్రధాని మోడీని మెచ్చుకోడం జో బైడెన్‌కి నచ్చలేదనీ భావిస్తున్నారు. రష్యన్ ఆయిల్‌పై అమెరికా, యూరోప్‌లు ఆంక్షలు విధించిన తర్వాత ఇండియా మాస్కోకు మరింత దగ్గరైంది. రష్యా నుంచి ఆయిల్‌ను చౌకగా దిగుమతి చేసుకోడం ప్రారంభించింది. తద్వారా 2023 మొదటి మూడు త్రైమాసికాల్లో 2.7 బిలియన్ డాలర్ల మేరకు పొదుపు చేయగలిగిందని సమాచారం. ఇదే ఆయిల్‌ను ఇరాక్ నుంచి కొనుగోలు చేసి వుంటే ఇంత మొత్తాన్నీ ఇండియా కోల్పోయి ఉండేది. అమెరికాలో పన్నున్ హత్యకు కుట్ర ఆరోపణపై ఇండియా దర్యాప్తు కమిషన్‌ను నియమించింది. అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో ఖలిస్తానీయులు ఇష్టావిలాసంగా భారత వ్యతిరేక ఉన్మాదానికి పాల్పడడం మన ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా తన చైనా వ్యతిరేక వ్యూహంలో భారత్‌ను భాగస్వామిని చేసి పబ్బం గడుపుకోజూస్తున్నది. దీని వల్ల ఇప్పటికే భారత, చైనా సంబంధాలు బెడిసికొట్టాయి. ఇండియా భారీ ఎత్తున కొనుగోలు చేయదలచిన ఆయుధాలను తన నుంచే తీసుకొంటుందని అమెరికా ఆశించింది. కాని ఈ విషయంలో ఇండియా ఇంకా ఊగిసలాటలోనే వుంది. ఫ్రాన్స్, రష్యాల నుంచి కూడా కొనుగోలు చేయాలనుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఇది కూడా ఇండియా పట్ల అమెరికాలో అసంతృప్తి కలిగించి వుంటుంది. అమెరికాను మితిమించి పెన వేసుకోడానికి బదులు దానికి సహేతుకమైన దూరంలో ఉండడమే మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News