వచ్చే నెల 3 వ తేదీన సుప్రీంలో విచారణ
సిఐసి నియామకం కోసం ఇప్పటికే సర్క్యులేషన్లో ఫైల్
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే నియామకం!
ప్రస్తుత సిఐసి ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుద్ధా మురళి
హైదరాబాద్: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకానికి కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఉన్న ఖాళీని భర్తీ చేసేందుకు సంబంధించిన దస్త్రం సిఎంఒకు చేరింది. సిఐసి నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కోనసాగుతోంది. వచ్చేనెల బెంచిపైకి రానుంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే ప్రభుత్వం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టును భర్తీ చేయనుంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ కార్యదర్శిగా 2017 సెప్టెంబర్ లో పదవీ విరమణ పొందిన రాజా సదారాంను ప్రభుత్వం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా నియమించింది. ఆగస్టు 2020 లో ఆయన సిఐసిగా పదవీ విరమణ చేశారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న బుద్ధా మురళికి ప్రభుత్వం ఇంఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి బుద్దా మురళి ఆ విధుల్లో కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యాంగపర పదవులను భర్తీ చేయాలంటూ అంజలి భరద్వాజ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో నలుగురు సమాచార కమిషనర్లను నియమించాలంటూ 2019 లో అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ఆదేశాల అనుసారం ఫిబ్రవరి 2020 లో ప్రభుత్వం మొత్తం ఐదుగురిని సమాచార కమిషనర్లుగా నియమించింది.
ఫిబ్రవరి నెలలో కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, గుగులోత్ శంకర్ నాయక్, డా. ఎండి అమీర్, ఖలీలుల్లాల నియామక ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణాలో రాజ్యాంగ పదవుల నియామకాల వివరాలు తెలియజేయాలని 2019 లోనే దాఖలైన మిసెలీనియస్ పిటిషన్ నెంబర్ 1979 ని కూడా అపెక్స్ కోర్టు విచారించింది. సంబంధిత సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బదులుగా 5 గురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమిస్తూ ఫిబ్రవరి 10 వ తేదీన జారీ చేసిన జిఒతో పాటు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాళీగా ఉన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు సమాచారాన్ని క్రోడీకరించింది. సిఐసి నియామకానికి సంబంధించిన పిటిషన్ జనవరి 3వ తేదీన సుప్రీం బెంచి ముందుకు రానుంది. ఆ తరవాత వెలువడే ఆదేశాల మేరకు తెలంగాణా ప్రభుత్వం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు నియామకం కోసం పేపర్ ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనుంది.
అటు ప్రస్తుత ఇంఛార్జి చీఫ్ కమిషనర్ తో పాటు, మిగిలిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లందరి పదవీకాలం 2023 ఫిబ్రవరితో ముగుస్తుంది. దీంతో 2022 నవంబర్ లోనే ఈ పదవులన్నిటి నియామకం కోసం ప్రభుత్వం పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. తరవాత ఆ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలు పెడుతుంది.