Saturday, November 16, 2024

ముఖ్యమంత్రి కనబడుటలేదు!

- Advertisement -
- Advertisement -

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రమేయంపై ఇడి అధికారులు మంగళవారం కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోమవారంనాడు ఢిల్లీలోని ముఖ్యమంత్రి ఇంటిపై ఇడి అధికారులు దాడి చేసి, ఒక బిఎండబ్ల్యు కారును, 32 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటలనుంచీ ఇడి అధికారులు సోరెన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మూడు రోజుల కిందట ఇడి సోరెన్ కు సమన్లు జారీ చేసింది. 29న గానీ,  31వ తేదీన గాని అందుబాటులో ఉండాలని కోరింది. అయితే సోరెన్ 27వ తేదీనుంచే అందుబాటులోకి లేకుండా పోయారు. సోరెన్ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన వ్యక్తిగత పనిపై వెళ్లారని, త్వరలోనే తిరిగి వస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సోరెన్, ఆయన సన్నిహితులకు సంబంధించిన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం గమనార్హం.

జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ జాడ కనిపెట్టవలసిందిగా ఇడి అధికారులు ఢిల్లీ పోలీసులను కోరారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి జనవరి 31న ఇడి అధికారులకు అందుబాటులో ఉంటారని, ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఇడి అధికారుల ముందుకు వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఇడికి సమాచారం ఇచ్చింది.

లాండ్ రికార్డులను తారుమారు చేయడం, సొంతదార్ల పేర్లను మార్చేయడం వంటి అవకతవకల ద్వారా 236 కోట్ల రూపాయల విలువైన భూములు మాఫియా ముఠా చేతుల్లోకి వెళ్లేలా చేశారంటూ కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంలో సోరెన్ హస్తం ఉన్నట్లు ఇడి అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ పద్నాలుగుమందిని అరెస్టు చేశారు. వీరిలో సోరెన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News