Monday, December 23, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే చేతివృత్తులకు భరోసా: జూలూరు గౌరీశంకర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వెల్లివిరుస్తున్న సాంకేతిక పరిజ్ఙానాన్ని చేతివృత్తులకు అందించి బహుజనుల జీవన ప్రమాణాలు పెంచాలనే దార్శనిక ఆలోచనలున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే చేతివృత్తులకు భరోసా లభిస్తోందని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. చేతివృత్తుల్లో కొనసాగుతున్న వారి జీవనప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం లక్ష రూపాయల రాయితీ స్వచ్ఛందంగా అందజేస్తోందని తెలిపారు. ఈ రకమైన సౌకర్యం దేశంలో మరే రాష్ట్రంలో లేదని జూలూరు తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వకర్మలకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చి ఆత్మగౌరవ భవననిర్మాణాన్ని కూడా రాష్ట్రప్రభుత్వమే భుజస్కంధాలపై వేసుకుని నిర్మిస్తోందని అన్నారు.

హయత్‌నగర్ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన సభలో జూలూరు గౌరీ శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రప్రభుత్వం మహిళాబిల్లు తేవడం అభినందించదగిందని, అయితే ఒబిసి మహిళలకు సబ్ రిజర్వేషన్లు ఇవ్వకపోవడం మాత్రం తీవ్రమైన అన్యాయమని జూలూరు గౌరీశంకర్ అన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న ఓబీసీల జనగణన చేయాలని, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా 75 ఏళ్ళుగా ఉన్న డిమాండును పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తే బహుజనులు ఉద్యమాలు చేయక తప్పదని ఆయన తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ విశ్వకర్మలు ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. సృష్టికర్తలుగా కీర్తించబడుతున్న విశ్వకర్మల చేతివృత్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి జీవనప్రమాణాలు పెంచేందుకు కృషిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సింహాద్రి చారి, పద్మనాభా చారి, లింగాచారి, కృష్ణమాచారి, రామాచారి, విష్ణుచారి, శ్రీనివాసచారి, సత్యం చారి, దయానంద చారి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News