ప్రధాని పరటనలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించిన ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా ఆయనను ఆహ్వానించేందుకు సిఎం కెసిఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే శనివారం ఉదయం నుంచి సిఎంకు జ్వరం రావడంతో ప్రధానమంత్రికి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు హాజరుకాలేకపోయారు. దీంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను హాజరు కావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డి.జి.పి.మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. సాయంత్రం వరకూ జ్వరం తగ్గితే.. చినజీయర్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి సిఎం కెసిఆర్ హాజరు కావాలని ప్రయత్నాలు చేశారు. అయితే డాక్టర్లు సలహా, సూచనల మేరకు ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకోవాల్సి వచ్చింది.