- రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్ల ద్వారా నీళ్లను అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దని రాష్ట్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మేడ్చల్ మండలం డబిల్ పూర్ గ్రామంలో సర్పంచ్ వీర్లపల్లి గీతా భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో నీళ్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా నీటిని అందజేయడం మహత్తర విషయమని అన్నారు. మిషన్ భగీరథ పథకం ను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆడబిడ్డలు నీటి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడ్డారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ తో ఇంటింటికి త్రాగునీరు, మిషన్ కాకతీయ తో పొలాలకు సాగునీరు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నా రెడ్డి నందారెడ్డి, ఎంపిపి వీర్లపల్లి రజిత రాజ మల్లారెడ్డి, జడ్పిటిసి శైలజ విజయానందరెడ్డి, డబిల్‌పూర్ మాజీ సర్పంచ్ రాజ మల్లారెడ్డి, నాయకులు భాగ్యరెడ్డి, దామోదర్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.