Monday, December 30, 2024

అవకాశాల గని ఆవిష్కరణల హబ్

- Advertisement -
- Advertisement -

రేపే టి.హబ్-2నుప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్

2వేలకు పైగా స్టార్టప్‌లు కార్యక్రమాలను
నిర్వహించుకునేందుకు మౌలిక వసతులు
నూతన ఆవిష్కరణలకు వేదిక కానున్న
హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం
మరింత బలోపేతం, స్టార్టప్‌లకు చేయూత
సిఎం కెసిఆర్, కెటిఆర్‌ల కృషిపై
సర్వత్రా ప్రశంసల జల్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టి హబ్-2 ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా టి-హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. టి-హబ్ 2 ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన ఓ సూక్తిని తన ట్వీట్‌లో ప్రస్తావించారు. భవిష్యత్తు ఊహకు దానిని సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గమన్న లింకన్ మాటలను ఆయన ప్రస్తావించారు. టిహబ్ నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్‌లో పొందుపర్చారు. టి హబ్-2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన విషయం విదితమే. అత్యాధునిక మౌలిక వసతులను కల్పించనుంది. రాయదుర్గం నాలెడ్జిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీనిని తీర్చిదిద్దారు. 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి క్యాంపస్లో టెక్నాలజీ హబ్ (టి-హబ్) ఏర్పాటు చేశారు.

పలు కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్లను టి-హబ్ ప్రొత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది. తాజాగా ప్రారంభించనున్న టి హబ్-2లో ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించనుంది. ఫలితంగా మరిన్ని నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ వేదికయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టి-హబ్, వి-హబ్, డేటా సెంటర్, టివర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది. ఇన్నోవేషన్ ఎకో సిస్టంను బలోపజేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు పొందింది. ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకో సిస్టంలో భాగమైన టి-హబ్, తెలంగాణ డేటా సెంటర్‌ను సందర్శించి సంతృప్తిని వ్యక్తపర్చింది.

మంత్రి కెటిఆర్ ట్వీట్‌లపై ప్రశంసల జల్లు

టి హబ్2 ప్రారంభోత్సవంపై మంత్రి కెటిఆర్ ట్వీట్‌కు పలువురు స్పందిస్తున్నారు. కెటిఆర్ కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ భవన నిర్మాణం కూడా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. టి హబ్2 భవనం ఎంతగానో ఆకట్టుకుంటుందని సానియా మీర్జా ట్వీట్ చేయగా, అద్భుతంగా ఉందని సైనా నెహ్వాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ భవనాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సమంత పేర్కొన్నారు. టి హబ్ భవనం హైదరాబాద్‌కు ఎంతో గర్వకారణం అని సినీ నటుడు సందీప్ కిషన్ పేర్కొన్నారు. కెసిఆర్ చొరవకు వందనాలు, భవనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పివి సింధూ ట్వీట్ చేశారు. ఇక గగన్ నారంగ్ స్పందిస్తూ.. శనివారం ఆ భవనం ముందు నుంచి వెళ్తున్నప్పుడు దానిని చూసి మురిసిపోయాను. ఆ ఫ్యాన్సీ బిల్డింగ్‌ను చూడాలని కారును తిప్పాను. దగ్గరికి వెళ్లి చూడగా అది టి హబ్ అని అర్ధమైపోయింది. కెటిఆర్‌కు వందనాలు అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News