Sunday, December 22, 2024

దసరా నుంచి సిఎం అల్పాహారం

- Advertisement -
- Advertisement -

మెనూను నిర్ణయించి ఏర్పాట్లు చేయాలి
అధికారులకు విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీ దేవసేన, విద్యాశాఖ అధికారులు, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు రానున్న దసరా పండుగ రోజు నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబందించిన మెనూను త్వరితగతిన నిర్ణయించి అందుకు ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి విధి, విధానాలను రూపొందించాలని సూచించారు.

రెండవ రాష్ట్రంగా తెలంగాణ
దేశంలోనే పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న రెండవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోనుందని మంత్రి సబిత పేర్కొన్నారు.నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చేపట్టిన ఈ పథకంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ పథకం అమలును జిల్లా స్థాయిలో పర్యవేక్షించే భాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించనున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన వంట పాత్రలను సమకూర్చే ఏర్పాట్లు ప్రారంభించాలని తెలిపారు. ఈ పథకం అమలుచేయడం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని, విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నా 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News