నేటి ఉదయం 11 గంటల్లోగా విచారణకు హాజరు
కావాలని పోలీసుల ఆదేశం సంధ్య థియేటర్
తొక్కిసలాట కేసులో ఎ11గా అర్జున్ పేరు
మన తెలంగాణ/సిటిబ్యూరో: సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో తమ ఎదుట హాజరు కావాలని సినీ హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు 18మందిపై కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీన పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న సంగతి తెలిసిందే.
లీగల్ టీంతో చర్చలు
తమ ఎదుట హాజరు కావాలని అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో అతడి కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే లీగల్ టీంను ఇంటికి పిలిపించుకున్నారు. పోలీసులు అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన విషయాలపై న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, దానికి ఏ సమాధానం చెప్పాలని న్యాయవాదులను అల్లు అర్జున్ అడిగినట్లు తెలిసింది. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ పోలీసుల వద్దకు వెళ్లనున్నట్లు తెలిసింది.