న్యూస్ డెస్క్: పట్టాయాలోని హోటల్‌కు చెందిన కన్వెన్షన్ హాలులో డబ్బుతో కార్డు గేమ్స్ ఆడుతున్న 83 మంది భారతీయ టూరిస్టులను థాయ్‌ల్యాండ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ గ్యాంబ్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాంగ్ లమంగ్ జిల్లాలోని చొన్మూరీలోని ఆసియా హోటల్‌లోపై పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. కార్డు డీలర్లుగా వ్యవహరించిన నలుగురు థాయ్ పురుషులను, ఇద్దరు థాయ్ మహిళలు, ఇద్దరు మయన్మార్ మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హోటల్‌లోకి చాలామంది భారతీయ టూరిస్టులు శనివారం వచ్చారని, వారంతా సోమవారం ఖాళీ చేయనున్నారని పోలీసులకు సమాచారం అందిందని చొన్బూరీ పోలీసు అధిపతి పాల్ మేజర్ జనరల్ కాంపోల్ లీలాప్రభాపార్న్ విలేకరులకు తెలిపారు. హోటల్‌లోని కన్వెన్షన్ హాలును తాత్కాలిక క్యాసినోగా మార్చినట్లు కూడా పోలీసులకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు 83 మంది భారతీయులు లభించారని, వీరిలో 71 మంది పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరంతా బాక్కారట్, బ్లాక్ జాక్ ఆడుతున్నారని, పోలీసులు చూసి వీరంతా పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.

హాలులో నాలుగు బాక్యారట్, మూడు బ్లాక్ జాక్ టేబుల్స్‌తోపాటు 25 సెట్ల కార్డులు, కోట్ల రూపాయలలో భారతీయ కరెన్సీ, 92 మొబైల్ ఫోన్లు, మూడు నోట్‌బుక్ కంప్యూటర్లు, మూడు కార్డు డిస్పెన్సర్లు, నగదుగా మార్చుకునే చిప్స్ లభించాయని పోలీసు చీఫ్ చెప్పారు. తాత్కాలిక క్యాసినోలో 100 కోట్ల రూపాయలు చెలామణి అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ టూరిస్టుల కోసం గ్యాంబ్లింగ్ ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు సీట్రానన్ కీలర్ అనే 32 ఏళ్ల థాయ్ మహిళ ఒప్పుకున్నట్లు పోలీసు చీఫ్ చెప్పారు.

ఒక్కో టూరిస్టుకు 50,000 బాహత్ చార్జ్ చేస్తామని, అందులో విమాన చార్జీలు, ఫుడ్, ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు రవాణా, హోటల్ రూము ఉంటాయని ఆ మహిళ చెప్పినట్లు ఆయన తెలిపారు. కన్వెన్షన్ హాలులోకి తమ హోటల్ సిబ్బంది ఎవరూ ప్రవేశించకుండా ఆంక్షలు విధించినట్లు ఆమె చెప్పినట్లు ఆయన తెలిపారు. కార్డు డీలర్లు, కార్డులు, గ్యాంబ్లింగ్ పరికరాలు భారత్ నుంచి వస్తాయని, హోటల్‌లో ఉన్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు టూరిస్టులు కార్డు ఆడతారని ఆమె చెప్పారు. అరెస్టయిన 93 మంది పట్టాయ పోలీసు స్టేషన్‌లో బందీలుగా ఉన్నారు. వారిపై అభియోగాలు నమోదయ్యాయి.
