హపూర్: ఆటాడుకుంటూ అనుకోకుండా ఓ బోరుబావి గుంతలో చిక్కుపడ్డ మూగబాలుడిని రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని కొట్లా సదత్ ప్రాంతంలో మంగళవారం నాలుగేళ్ల బాలుడు లోపలపడ్డాడు. వెంటనే సమాచారం తెలిసిన విపత్తు నిర్వహణ దళం అక్కడికి చేరుకుని ఐదు గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసింది. చాలా సేపటి వరకూ ఈ బాలుడి జాడ తెలియకుండా పోయింది. తరువాత సహాయక బృందాలు గుర్తించి వెలికితీశారని ఎస్‌పి దీపక్ భుకెర్ విలేకరులకు తెలిపారు. ముందుగా బోర్‌వెల్‌లోకి ఆక్సిజన్ పంపించి జాగ్రత్తలు తీసుకున్నారు.
తరువాత అత్యంత సాంకేతిక మెళకువలు పాటించి బాబును బయటకు తీశారు. బాలుడు మావియాను బయటకు తీయడం సహాయక బృందాలకు చాలా కష్టం అయింది. బాలుడు మూగవాడు కావడంతో తన పరిస్థితి గురించి ఏమీ చెప్పలేకపోవడం, లోపల చీకటి వంటి పరిస్థితుల నడుమ చాలా జాగ్రత్తగా పరిస్థితిని బేరీజు వేసుకుని బాలుడిని ప్రాణంతో తీసుకువచ్చామని సహాయక బృందాలు తెలిపాయి. తమ బాబుకు తిరిగి ప్రాణాలు పోశారని తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.