Thursday, July 4, 2024

సంగీతానికి స్పందించే పసి హృదయాలు

- Advertisement -
- Advertisement -

సప్తస్వరాల్లో భాష భావోద్వేగముంది. మనోభావాలను ప్రేరేపించి, శాంతపరిచే శక్తిగల సంగీత గుణముంది. ఆనందం, ఉత్తేజం కలిగించే స్వభావముంది. శిశువు పుట్టినప్పుడు, వారికి స్పష్టమైన దృష్టిని పొందడానికి కొంత సమయం పడుతుంది. కానీ వినికిడి అభివృద్ధి చెందడానికి ప్రారంభ ఇంద్రియాలలో ఒకటి. వాస్తవానికి తల్లి కడుపులో ఉన్నప్పుడే శబ్దాలను వినగలుగుతారు. చిటికె వేసినప్పుడు, చెంచా కొట్టినప్పుడు, పాత్రను లాగుతున్నప్పుడు వచ్చే శబ్దాలకు స్పందిస్తుంటారు.

శిశువుల తొలి ఉద్దీపనలలో సంగీతం ఒకటి. అందుకే లాలిపాటలతో మైమరచిపోతారు. రకరకాల సున్నితమైన మృదువైన శబ్దాలు శిశువు ఇంద్రియ గ్రహణశక్తిని పెంపొందించడానికి దోహదపడుతాయి. స్వరాగాలు, గేయాలను శిశువుల ముందు ఆలపించినప్పుడు వారు భాషను మెరుగ్గా నేర్చుకోగలుగుతారని పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. శిశువులు ఎదుగుతున్న కొద్దీ సంతోషకరమైన సంగీతం విని ఆనందాయక చిత్రాలను, విషాద సంగీతం విని తదనుగుణమైన చిత్రాలను గీసే శక్తిని సంతరించుకుంటారని అధ్యయనాలు తేల్చాయి. చిన్నపిల్లలకు తల్లిపాడే జోల పాటలు, ముద్దుముద్దు మాటలకు చక్కగా స్పందిస్తారనే అంశం నిరూపణ అయింది. గర్భందాల్చిన 28వ వారానికి తల్లి తనకు ఇష్టమైన సంగీతం వింటూ ఉంటే, గర్భస్థ పిండం హృదయ లయ పెరిగిందని పరిశోధనలు ధ్రువపరిచాయి.

తొలి ఏడాదిలో చిన్నారులు ఉచ్చారణకు సంబంధించిన సమాచారం కన్నా లయతో ముడిపడ్డ ప్రక్రియ ద్వారా మెరుగ్గా ఔపోసనపడుతారు. శిశువు అభివృద్ధికి కొన్ని రకాల సంగీత స్వరాలు దోహదపడుతాయి. మానసిక శ్రేయస్సు, మేధో వికాసానికి సంగీతం కీలకంగా మారింది. మెదడు అభివృద్ధి, అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది. శిశువు చెవులు, కళ్ళు గర్భం దాల్చిన రెండవ నెలల నుంచి అభవృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. వేగవంతమైన కణ నిర్మాణం జరిగే కాలం, కణాలు వివిధ ముఖ అవయవాలలో తమను తాము సమూహపరచుకోవడం మొదలవుతుంది. తొమ్మిదవ వారంలో పిండం మెడ వెంట చిన్న మొగ్గవంటి ఇండెంటేషన్లు ఏర్పడుతాయి. ఇవి శిశువు చెవులు, కర్ణభేరి తదితరమైన భాగాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. 18వ వారం వచ్చేనాటికి శబ్దాలను వినగలుగుతారు. 27వ వారంలోగా వినికిడి సామర్ధ్యం మెరుగుపడుతుంది. 2526 వారాల మధ్య బయటి శబ్దానికి ప్రతిస్పందిస్తుంది.

సాధారణంగా గర్భంలోని శిశువుకు మొదటి శబ్దాలు తల్లి శరీరం నుంచి సృష్టించబడుతాయి. తల్లి గుండె చప్పుడు, కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడం, ఊపిరితిత్తులు గాలితో నిండిపోవడం… ఈ స్వర కంపనాలు శిశువుకు అందుతాయి. శిశువు చర్మం, కొవ్వు పొరల కింద ఉండి, అమ్నియోటిక్ ద్రవంలోకి తొలగించబడుతుందని గుర్తించాలి. దీంతో బయటి ధ్వనులకు స్పందిస్తుంటారు. ఇటీవల కాలంలో శిశువు మెదడు అభివృద్ధికి సంగీతం దోహదపడుతుందని గుర్తించిన చాలా మంది గర్భిణులు, బయట మార్కెట్లో లభ్యమవుతున్న మ్యూజికల్ సీడీలను కొనుగోలు చేసి వింటున్నారు. శాస్త్రీయ సంగీతం మెదడు అభివృద్ధికి ప్రధానంగా దోహదకారిగా నిలుస్తుందని నిష్ణాతులు అభిప్రాయపడుతున్నారు. గర్భవతి సంతోషంగా, విశ్రాంతంగా ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

సంగీత ధ్వని 5060 డెసిబుల్స్‌కు మించకుండా ఉండాలని సూచించారు. తల్లి తన బొడ్డుపై చెవిప్లగ్‌లు, హెడ్‌ఫోన్‌లు ఉంచరాదని, వీటి వల్ల అమ్నియోటిక్ ద్రవం ప్రతిధ్వనిస్తుందని, బొడ్డ దగ్గరగా శబ్దాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. శిశువు చెవికి ఉత్తమ సంగీతం తల్లిస్వరమని ప్రతి గర్భిణి గుర్తించాలని స్పష్టం చేశారు. శిశువు పుట్టిన మొదటి రోజు నుంచి పెద్ద శబ్దాలను వినగలుగుతారు. మొదటి నెల చివరి నాటికి, తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యుల గొంతును పసిగట్టగలుగుతారు. లాలిపాటలు, సుపరిచిత శబ్దాలను వింటూ బుడిబుడి అడుగులు వేస్తుంటారు. ఆరు నుంచి ఏడాది వయస్సు వచ్చేనాటికి అభివృద్ధి పురోగతి ఆధారంగా వివిధ దిశల నుంచి వచ్చే శబ్దాలను వినగలుగుతారు. ముఖ్యంగా ఆడ గొంతుకకు బాగా స్పందిస్తారు. అందుకే వాళ్లని ఎత్తుకుని లాలిస్తున్నప్పుడు స్పందన అనూహ్యంగా ఉంటుంది. లయబద్ధమైన సంగీతం, సంభాషణల శబ్దాలు పసి పిల్లల మెదడుపై చురుగ్గా పని చేస్తాయి.

దీంతో వేగంగా స్పందిస్తారని పరిశోధకులు విశ్లేషించారు. 39 మంది శిశువులను బృందాలుగా విడదీసి, నెల రోజుల పాటు ప్రయోగాత్మక అధ్యయనాలను పరిశోధకులు నిర్వహించారు. ఓ బృందానికి చెందిన శిశువులకు సంగీతం కాకుండా ఆటబొమ్మలను అందజేసి, ఆడుకుంటున్న సమయంలో వారి మెదడు స్పందనలను అంచనా వేశారు. ఈ పిల్లల్లో కాగ్నెటివ్ స్కిల్స్ (అభిజ్ఞా నైపుణ్యం) దశల వారీగా వృద్ధి చెందినట్లు తేలింది. సంగీతం, భాషలో ఓ శక్తివంతమైన లయ విన్యాసం ఉండటం వల్ల పిల్లలు సులభంగా గ్రహించగలుగుతున్నట్లు గుర్తించారు. పిల్లలు మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధనలు పేర్కొన్నాయి.

నవమాసాలు పూర్తి చేసుకుని పుట్టిన 32 మంది శిశువులపై ప్రయోగాలు జరపగా ఆనందదాయక సంగీతం విన్నప్పుడు వారు నిద్రలోకి జారుకున్నారు. విషాద సంగీతం లేదా నిశ్శబ్దం వారిపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. సంగీతంలోని భావోద్వేగాలు శిశువులను ప్రభావితం చేస్తాయి. మూడవ నెల, ఆరవ నెల దాటిన గర్భస్థ పిండాలకు తల్లి మాటలను, పాటలను, సంగీతాన్ని వినే శక్తి ఉంటుంది. వారు పుట్టిన తరువాత ఆ శక్తి కొనసాగుతుందని పరిశోధనలు వివరించాయి. ఇక శిశువుల ఎదుట గేయాలను ఆలపిస్తే వారు భాషను మెరుగ్గా నేర్చుకోగలుగుతారని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధన తేల్చింది.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News