Thursday, January 23, 2025

బాల్యవివాహాల నివారణ చర్యలు భేష్

- Advertisement -
- Advertisement -

Child marriages reduced in Telangana: Vinod Kumar

నోబెల్ పీస్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి
రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు : బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్ : బాలల హక్కుల పరిరక్షణ కోసం, బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ పీస్ అవార్డు గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాస్‌సత్యార్థి అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో కైలాస్ సత్యార్థితో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్‌లో నిర్మించిన, నిర్మిస్తున్న బాల బాలికలు, మహిళా రక్షణ ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేసిన విషయం కైలాస్ సత్యార్థికి వినోద్‌కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బాల బాలికలపై జరుగుతున్న వివిధ రూపాల దాడుల నివారణ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న కైలాస్ సత్యార్థి… తెలంగాణలో బాల బాలికల కోసం అమలు జరుగుతున్న పథకాలపై వినోద్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు తీరిన బాల బాలికల వివాహాలకు మాత్రమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని వినోద్‌కుమార్ ఆయనకు తెలిపారు.

కల్యాణలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు 11,25,204 మందికి మొత్తం రూ. 9,662.76 కోట్లు మంజూరు చేసినట్లు వినోద్‌కుమార్ తెలిపారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 2,20,670 మందికి మొత్తం రూ. 1,782.38 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఎస్‌సి వర్గానికి చెందిన 2,23,096 మంది యువతులకు మొత్తం రూ. 1,824.38 కోట్లు, ఎస్టీ వర్గానికి చెందిన 1,36,567 మంది యువతులకు మొత్తం రూ. 1,124.98 కోట్లు, బిసి వర్గానికి చెందిన 4,94,353 మంది యువతులకు మొత్తం రూ. 4,462.06 కోట్లు, ఈబిసి వర్గానికి చెందిన 50,518 మంది యువతులకు మొత్తం రూ. 468.96 కోట్లు, షాదీ ముబారక్ మైనారిటీ వర్గానికి చెందిన 2,20,670 మంది యువతులకు మొత్తం రూ. 1,782.38 కోట్లు మంజూరు చేసినట్లు కైలాస్ సత్యార్థికి వినోద్‌కుమార్ వివరించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.

ఈ గణాంకాలు చూసిన కైలాస్ సత్యార్థి స్పందిస్తూ బాల్య వివాహాలు తగ్గించేందుకు, బాలల హక్కుల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కైలాస్ సత్యార్థి అభినందించారు. అమెరికాలో సెప్టెంబర్ 18 న జరుగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని కైలాస్ సత్యార్థి పేర్కొన్నట్లు వినోద్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 18 వ తేదీని బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణ దినోత్సవంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటామని కైలాస్ సత్యార్థి ప్రకటించారని వినోద్‌కుమార్ వివరించారు. అక్టోబర్ నెలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బాలల రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరు కావాలని కైలాస్ సత్యార్థిని వినోద్‌కుమార్ కోరగా, అందుకు ఆయన తన సంసిద్ధతను తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News