1000 మంది పోలీసులతో రాష్ట్రమంతటా తనిఖీలు
1000 సిసిటీవీల ఫుటేజీల విశ్లేషణ
మనతెలంగాణ/ హైదరాబాద్: సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు రాజు కోసం వేయిమంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీసులతో పాటు రంగారెడ్డి,- యాదాద్రి-, నల్గొండ,- కరీంనగర్ జిల్లా పోలీసులను అలెర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హైవేలపై పోలీసులు నాకా బందీ ఏర్పాటు చేయడంతో పాటు సూర్యాపేట, విజయవాడ హైవే పై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా ఎల్బి నగర్ నుంచి లింక్ ఉన్న హైవేలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించిన ఆనవాలు ఆధారంగా ఎల్బి నగర్లో అణువణువు గాలిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో రాజును ఒక కేసు విచారణలో చైతన్యపురి పోలీసులు పిలిపించారు. అక్కడ పోలీసులు తీసిన ఫోటోనే ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. రాజును పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్, సిసిఎస్, ఎస్వోటి టీమ్‌లతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఇప్పటికే నిందితుడి ఆచూకీ కోసం రూ. 10 లక్షల రివార్డు సైతం ప్రకటించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు. దారుణం జరిగి ఇప్పటికే వారం రోజులు కావొస్తున్న నిందితుడి జాడ మాత్రం దొరకకపోవడంతో ప్రజా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఉప్పల్‌లో నిందితుని ఆనవాళ్లు
హత్యాచారం కేసులోని నిందితుడు రాజు ఉప్పల్ వరకు వెళ్లినట్లు మంగళవారం రాత్రి పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో ఉప్పల్ సిగ్నల్ దగ్గర నిందితుడు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డు అయ్యాయి. అక్కడ ఓ వైన్ షాపు దగ్గర తన చేతిలో ఉన్న కవర్‌ను రాజు పడేశాడు. ఈ కవర్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో కవర్లో కల్లు సీసా, టవల్ స్వాధీనం చేసుకున్నారు. రాజు చేతిలో రూ.700లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదిలావుండగా జంటనగరారల్లోకి దాదాపు 180 వైన్ షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా సారిస్తున్నారు. నిందితుడు రాజు తలకు ఎర్రటి టవల్ కట్టుకుని మరీ జాగ్రత్త పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు దాదాపు 1000 సిసిటివి కెమెరాల డేటాను పోలీసులు అనాలసిస్ చేస్తున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో నిందితుడు రాజు ఫోటో చూపెట్టి పోలీసులు తనికీలు చేస్తున్నారు. ఆరేళ్ల చిన్నారి రేప్ అండ్ మర్డర్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ డిసిలో ఎన్ఆర్ఐలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి . చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
సిసిటివి ఫుటేజీ ఆధారంగా
ఈ కేసులోని నిందితుడు ఫోన్‌ను వినియోగించని కారణంగా పోలీసులు 1000 సిసిటివిల అనాలసీస్ చేస్తూ నిందితుడిని గుర్తించి పట్టుకునే యత్నాలు చేస్తున్నారు. నిందితుడు ఫోన్ వాడకపోవడం వల్ల ఫీల్డ్ వర్క్ చేయాల్సివస్తోందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. నిందితుని కోసం వేలాది సిసి కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా సిసి కెమెరాల కంటికి చిక్కకుండా రాజు తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు తీవ్ర యత్నాలు సాగిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా టెక్నికల్‌గా సిసిటివిలను కనెక్ట్ చేసుకుంటూ విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో చెకింగ్‌ను ముమ్మరం చేశారు. ఎల్బి నగర్‌కు కనెక్ట్ అయ్యే అన్ని హైవేలను జల్లెడపడుతున్నారు. వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్, శ్రీశైలం హైవేల్లో గాలింపు చేపట్టారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి టోల్ ఫ్లాజాను దాటుకుంటూ నిందితుడు వెళ్లినట్లు సిసి ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. అచ్చం నిందితుడి పోలికలతో కూడిన వ్యక్తి జాతీయ రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నట్లు సిసి ఫుటేజ్‌ల్లో కనిపించింది. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుండగా ఆర్టిసి ఎండి సజ్జనార్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులోని నిందితుడు ఒక ఆవారా కాబట్టి బస్టాండుల్లో, ఫుట్‌పాత్‌లపై పార్కులు ఇతర ప్రదేశాల్లో కనిపించే అవకాశాలున్నాయని ఈ దిశగా గాలం వేసి పట్టుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు.
సెర్చ్ ఆపరేషన్ పరిశీలించిన డిజిపి
సింగరేణి నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా రాష్ట్ర డిజిపి పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఆచూకీ గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారుతోందని, సిసిటివిల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డిజిపి తెలిపారు. ఈ నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ రాజుకు సంబంధించి మరిన్ని ఫోటోలు, క్లూస్‌ని హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేశారని ఆ మేరకు రెండు ట్వీట్స్ చేయడం జరిగిందన్నారు. నిందితుడు ఎవరూ తనను గుర్తించకుండా గుండు చేయించుకుని ఉంటే ఎలా ఉంటాడన్న దానిపై ఓ ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశామని, నిందితుడి చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఉంటుందని ఆచూకీ తెలిపిన వారికి రివార్డు అందించడంతో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డిజిపి తెలిపారు.
కనిపిస్తే కాల్ చేయండి ః సిపి స్టీఫెన్ రవీంద్ర
సింగరేణి కాలనీలో జరిగిన ఘటనలో హత్యాచార నిందితుడు రాజు ఎవరికైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలని ప్రజలకు సైబరాబాద్ సిపి స్టీఫెన్వ్రీంద్ర విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్‌ని ఏర్పాటు చేశామని, డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లు అలర్ట్ అయ్యాయన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మఫ్టీ పోలీసులు, ఎస్‌వొటి, ఎస్బి, లోకల్ పోలీసులతో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. .బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేసులు, టోల్ గేట్స్ వద్ద, లాడ్జీల్లో ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పోలీసులతో అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. హ్యూమన్ ఇంటలిజెన్స్ సహాయం తీసుకుంటున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలోని సిసి కెమెరాల్ని, పుటేజీని పరిశీలిస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుని స్నేహితుడు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు కోసం గాలిస్తుండగా అతడి స్నేహితుడు పోలీసులకు చిక్కాడు.పోలీసులు సిసి ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బినగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బినగర్ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. ఈక్రమంలో సిసి ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బి నగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు. కాగా రాజు పారిపోయే ముందు ఎల్‌బినగర్‌లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు అక్కడి నుంచి పరారై నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లి అక్కడి నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు రాజు స్నేహితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన అనంతరం రాజు ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నిస్తున్నారు. రాజును ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేపట్టి స్నేహితుడి నుంచి రాజు ఆచూకీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.