Saturday, December 21, 2024

మసకబారుతున్న భావితరం

- Advertisement -
- Advertisement -

నడక, నడతను ప్రభావితం చేసేది కంటిచూపు. చూపు దెబ్బతిన్నదంటే జీవన వికాసానికి ప్రమాదమేర్పడుతుంది. పుట్టుక ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అందు కే, శరీరంలోని అన్ని అవయవాలకంటే కళ్లు ప్రధానమైనవిగా పేర్కొన్నారు. కంటిని కాపాడుకోవడంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తెలియకుండా వచ్చే ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాలకు చిన్నారులు బలైపోతుండటం తల్లిదండ్రులు, సమాజానికి పెద్ద ఆపదను తెచ్చిపెడుతున్నాయి. మయోపియా, క్యాటరాక్ట్, రెటినోపతి, గ్లకోమా, మెల్లకన్ను, అంధత్వం వంటి సమస్యలు పెద్దవారికే కాకుండా చిన్నపిల్లలకు శాపంగా మారాయి.

నెలలు నిండక ముందే పుట్టిన శిశువుల్లో అంధత్వ ముప్పు (రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ ఆర్‌ఒపి) పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల శిశువులు జన్మిస్తుంటే, అందులో 15 శాతం నెలలు నిండక ముందే పుడుతున్నారు. వీరిలో 50 శాతానికి అంధత్వ ముప్పు ఏర్పడుతోంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు లేదా రెండు కిలోల కంటే తక్కువ బరువుతో ఉన్న శిశువుల్లో ఆర్‌ఒపి ముప్పు ఎక్కువగా ఉంటోంది. శిశువు పుట్టిన నెల రోజుల్లో స్క్రీనింగ్ చేసి, చికిత్స అందించగలిగితే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశముంది. మయోపియా వ్యాధితో దేశ వ్యాప్తంగా 5 15 ఏళ్ల వయసులో 17 శాతం మంది బాధపడుతున్నట్లు భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయివ్‌‌సు) తెలిపింది. 2010లోనే ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ఈ వ్యాధితో ఇబ్బందిపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలుపగా, 2030 నాటికి ఈ సంఖ్య 300 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. ఇక కంటిచూపును నిశ్శబ్దంగా మాయం చేసే వ్యాధి గ్లకోమా. దేశ వ్యాప్తంగా పిల్లలతో సహా 1.12 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటి కళ్లను దృష్టి లోపాలు చుట్టుముడుతున్నాయి. పిల్లలు అధికంగా కళ్ల సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలు వెంటనే గుర్తించలేనివి. గుర్తించడం కూడా అంత తేలికా కాదు. పిల్లల ప్రవర్తన, చదివే తీరు, చూసే చూపును బట్టి గుర్తించవచ్చు. ఎక్కువ సమయం ఫోన్లు, కంప్యూటర్లు చూడడం, టివికి దగ్గరగా కూర్చోవడం, పోషకాహార లోపం వల్ల చాలా మంది పిల్లల కళ్లు పొడిబారుతుంటాయి. దీంతో మంట, దురదను కలిగిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల పిల్లలు మానసిక సామర్ధ్యం తగ్గడంతో పాటు కంటి సమస్యలు వస్తున్నట్లు ఓ పరిశోధన వెల్లడించింది. తెర నుంచి వచ్చే నీలిరంగు వెలుతురు కంటి చూపును దెబ్బ తీస్తున్నట్లు తెలిపింది. కరోనా కాలంలో పిల్లలు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడంతో కళ్లపై తీవ్ర ప్రభావం చూపించి ‘మయోపియా’ సమస్య చాలా మంది పిల్లల్లో తలెత్తినట్లు వైద్యులు వెల్లడించారు. చైనాలోని 12 వేల మంది విద్యార్థులు ఈ వ్యాధికి గురైనట్లు ‘బ్రైన్ చిల్డ్డ్రన్ విజన్ ఇన్‌స్టిట్యూట్’ పేర్కొంది. ఎక్కువ సమయం నీలి కాంతి కనుగుడ్లపై పడటం వల్ల కళ్లలోని నీటి పొర దెబ్బతిని, కంటి పొరలోని నీరు ఆవిరై మంటలు వస్తున్నాయి. తద్వారా ఎర్ర కన్ను, నల్లగుడ్డుపై తెల్లపొర ఏర్పడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా 913 ఏళ్ల పిల్లలు రోజుకు మూడు గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్లు చూస్తున్నట్లు ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడయింది. 13 17 ఏళ్ల పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలైనట్లు 44 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. మూడు గంటలకుపైగా ఫోన్లతోనే గడుపుతున్నట్లు 62 శాతం మంది తల్లిదండ్రులు వివరించారు. పట్టణాల్లో పది మంది పిల్లల్లో నలుగురు ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తున్నట్లు స్పష్టమైంది.

15 ఏళ్లలోపు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం 83 శాతం ఉంది. దీంతో గతంతో పోలిస్తే పిల్లల్లో కంటి సమస్యలు అధిగమైనట్లు సర్వేలో తెలిసింది. ప్రతి వంద మంది పిల్లల్లో 23 మంది వరకూ కళ్లు సరిగ్గా కనపడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో తొలి దశలోనే కంటి సమస్యలు గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో కంటిచూపు కోల్పోయే ప్రమాదమున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక జన్యుపరంగా వచ్చే కంటి సమస్యలు సరేసరి.

జన్యుపరంగా పిల్లల అలవాట్ల వల్ల ‘మయోపియా’ వచ్చే అవకాశముంది. దూరంగా ఉన్న మనుషులు, వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం దీని లక్షణం. కనుగుడ్డు మరీ పెద్దగా ఉన్నప్పుడు, కంటి బాహ్య రక్షణ పొర వక్రీభవనం చెందుతుంది. ఫలితంగా ప్రతిబింబం రెటీనాపై కాకుండా, దాని ముందు కేంద్రీకృతం అవుతుంది. దాని వల్ల దూరంగా ఉన్న వస్తువులు, మనుషులు మసగ్గా కనిపిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కంటికి దగ్గరగా పెట్టుకుని పుస్తకాలు చదవడం, టివి, సెల్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల మయోపియా బారినపడే అవకాశముంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం జనాభా ఈ వ్యాధి బారిన పడవచ్చునని అంచనా.

మెల్లకన్ను కూడా ఓ జబ్బే. దాన్ని సరిచేసుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేయడంతో చూపుకి ప్రమాదం ఏర్పడుతుంది. కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ, రెండూ ఒక దిశవైపు కదులుతూ ఒకే దృశ్యాన్ని గ్రహించి మెదడుకు పంపిస్తాయి. ఆ దృశ్యాలను మెదడు మనకు పొడవు, వెడల్పు, లోతు తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. ఈ రెండు కనుగుడ్లు సమన్వయం లోపించినప్పుడు ఒక్కొక్కటీ ఒకవైపు చూస్తుంది. దీన్నే మెల్లకన్నుగా పిలుస్తారు. పుట్టిన ఆరు నెలలకు కంటిలో ఈ సమస్యను కనుగొనవచ్చు.

నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. అనుమానం రాకుండా చూపును మింగేసే వ్యాధి ‘గ్లకోమా’. నీటికాసుల వ్యాధిగా పిలుచుకునే ఈ వ్యాధి పిల్లల్లో కొందరికి పుట్టిన వెంటనే గానీ, నెలలోపు గానీ వచ్చే వీలుంది. మేనరికం వివాహాలు చేసుకున్నవారికి పుట్టే పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కంటి నరాలు తీవ్రంగా దెబ్బతిని, కంటి లోపల వొత్తిడి పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా పిల్లలతో సహా 1.12 కోట్ల మంది గ్లకోమాతో బాధపడుతున్నారు. ఇందులో 11 లక్షల మంది శాశ్వతంగా అంధులయ్యారు. సమస్యను ముందే గుర్తించడం ద్వారా 80 శాతం వరకు నివారించే వీలుంటుంది. నెలలు నిండకుండా పుట్టిన పసిపాపల నిదుర కళ్లను ‘రెటినోపతి (ఆర్‌ఒసి)’ కాటేస్తోంది. దాదాపు 30 40 శాతం పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

వీరిలో కోలుకునే అవకాశం లేక 15 శాతం అంధత్వానికి గురవుతున్నారు. 40 శాతం మేరకు కొద్దిపాటి చూపు వచ్చినా పెద్ద వస్తువులను మాత్రమే చూడగలుగుతున్నారు. వెయ్యి గ్రాముల లోపు పుట్టిన శిశువులను నెలలోపు రెటినోపతి పరీక్ష చేయించాలి. ‘క్యాటరాక్ట్’ సమస్య కూడా చిన్న పిల్లలను వేధిస్తోంది. మారిన జీవనశైలి, పర్యావరణ విషతుల్యంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఇక పుట్టుకతో అంధత్వం ఒక సమస్య కాగా, దృష్టి దోషాలను సరైన సమయంలో సరిచేయకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా చాలా మంది చూపును కోల్పోతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 4.9 కోట్ల మంది అంధులు ఉండగా, మన దేశంలో 1.2 కోట్ల మంది అంధులుగా జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ పథకం మంచి ఫలితాలను ఇస్తోంది. కంటి పరీక్షలను సార్వత్రికం చేస్తే పిల్లలకు ఎంతో మేలు కలుగనుంది. తద్వారా ఎంతో మంది చిన్నారులు అంధత్వం బారిన పడకుండా నివారించవచ్చు. చదువు విషయంలో పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి వారి కళ్లు, మనస్సుపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా దృష్టి లోపాలు తలెత్తుతున్నాయి. పిల్లలపై అనవసర ఒత్తిడిని తగ్గించడం, పోషకాహారం అందివ్వడంపై పాలకులు దృష్టి సారించాలి. భవిష్యత్తు తరాలు అంధకారంలోకి వెళ్లకుండా కాపాడడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా గుర్తెరుగాలి.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News