గర్భధారణ సంబంధిత ఊబకాయం , బరువు పెరగడం వంటి మార్పులు దక్షిణాసియా పిల్లల ప్రాథమిక దశలో శరీరంలో అత్యధికంగా కొవ్వు కండరాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని కెనడా మెక్‌మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జెఎఎంఎ)లో ఈ అధ్యయన వివరాలు వెలువడ్డాయి. దక్షిణాసియాకు చెందిన 900 మంది పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు. మొదటి మూడేళ్లలో పిల్లల్లో ఊబకాయాన్ని నివారించే అంశాలను తెలుసుకోగలిగారు. తల్లి నుంచి స్తన్యపోషణ కనీసం ఏడాది పాటు అందుకున్న పిల్లలు భౌతికంగా చాలా చురుకుగా ఉంటారని గ్రహించారు. అలాగే పిల్లలకు స్క్రీన్ టైమ్ తగ్గిస్తే ఊబకాయం వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని తెలుసుకున్నారు.
పిల్లల్లో ఊబకాయాన్ని పరిగణించడానికి బాడీమాస్ ఇండెక్స్ వంటి ప్రస్తుత ప్రమాణాలు దక్షిణాసియాలో పనిచేయవని పరిశోధకులు సౌదీ అజాబ్ పేర్కొన్నారు. ఎందుకంటే దక్షిణాసియా నవజాత శిశువులు సాధారణంగా బరువు తక్కువతో పుడతారు. కానీ తెల్ల యూరోపియన్లతో పోల్చి చూస్తే శరీరంలో కొవ్వు శాతం మాత్రం అత్యధికంగా ఉంటుంది. మాంసం, గుడ్లు, పండ్లు, కూరగాయలు, సముద్ర చేపలు, నూనె అంతగా లేని పూరీ, ఇడ్లీ, దోసె వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఊబకాయాన్ని చాలా వరకు నివారించవచ్చని పరిశోధకులు సూచించారు. అయితే చాలా అధ్యయనాలు యూరోపియన్ కుటుంబాలను చేర్చుకుని నిర్వహిస్తుంటాయి. అలా కాకుండా విభిన్న జాతులు, తెగలతో పిల్లల ఊబకాయంపై ఒకే అంశంపై కాకుండా అనేక కోణాల్లో విస్తృతంగా పరిశోధన జరగాల్సి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.