కోల్‌కతా: పిల్లలు కాదు పిడుగులు వాళ్లు మైనర్ అయిన తమ స్నేహితురాలికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలుసుకుని ఆ పెళ్లిని అడ్డుకున్న ధైర్యవంతులు వాళ్లు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరో తరగతి చదువుతున్న తమ మైనర్ కుమార్తెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆ బాలిక కుటుంబం నిర్ణయించింది.
కొద్ది రోజులుగా తమ స్నేహితురాలు స్కూలుకు రాకపోవడంతో అదే స్కూలులో చదువుతున్న ఆ బాలిక స్నేహితులు ఆమె ఇంటికి వెళ్లారు. బలవంతంగా తమ స్నేహితురాలికి పెళ్లి చేస్తున్న విషయం తెలిసి వారు ప్రతిఘటించారు. ఆమెను స్కూలుకు పంపాలని, ఆమెకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తారని ఆమె కుటుంబాన్ని నిలదీశారు. దీంతో భయపడిన ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెను వరుడు ఇంటికి తరలించి రాత్రికి రాత్రే పెళ్లి చేయాలని భావించారు. అయితే ఆమె స్నేహితులు వరుడి ఇంటికి చేరుకుని పెళ్లి ఆపకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన పెళ్లి పెద్దలు ఆమెకు మైనారిటీ తీరిన తర్వాతే పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ పిల్లలు చూపిన తెగువకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.