Friday, November 15, 2024

బాల్యాన్ని మింగేస్తున్న కేన్సర్

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు గొప్పింట్లో కనిపించే ‘కేన్సర్’ భూతం, ఇప్పుడు పేద ధనిక తేడా లేకుండా బాల్యాన్ని కూడా మింగేస్తోంది. లుకేమియా, మెదడు కేన్సర్, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూ మర్ వంటి కేన్సర్లు చిన్నారులను నులిపెడుతున్నాయి. బలహీన ఆరోగ్య వ్యవస్థ కలిగిన తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే బాల్య కేన్సర్ల భారం అధికంగా ఉంది. మన దేశంలో మొత్తం కేన్సర్ కేసుల్లో 1.6 నుంచి 4.8 శాతం వరకు పదిహేనేళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లల్లో కనిపిస్తోంది. పది శాతం కేసులు మాత్రమే జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తున్నాయి.

ఏడాదిలోపు పిల్లల్లో తలెత్తే కేన్సర్లలో ‘న్యూరోబ్లాస్టోమా’ ఒకటి. నాలుగేళ్లలోపు పిల్లల్లో లుకేమియా సాధారణంకాగా, 916 ఏళ్ల పిల్లల్లో బోన్ కేన్సర్లు అధికంగా ఉంటున్నాయి. ప్రతి ఏటా సుమారు 75 వేల మంది పిల్లలు కేన్సర్‌కు గురవుతున్నట్లు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ తెలిపింది. గ్లోబల్ చైల్డ్ హుడ్ కేన్సర్ నిష్పత్తిలో కనీసం 20 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయి. 514 ఏళ్ల పిల్లల్లో సుమారు 50 శాతం మరణాలకు కేన్సర్ సంబంధిత వ్యాధులు కారణమవుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. సరైన అవగాహన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ద్వారా కేన్సర్ సమస్యని అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కేన్సర్ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. కానీ, కేన్సర్ బాధితుల్లో ఐదు శాతం పిల్లలే ఉంటున్నారు. చెడు అలవాట్ల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా పిల్లలు కేన్సర్ బారినపడటం దురదృష్టంగానే భావించాలి. పుట్టుకతోనే జన్యువుల పని తీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అయితే సరైన సమయంలో గుర్తించగలిగితే పిల్లల్లో తలెత్తే కేన్సర్లనీ దాదాపుగా నయం చేయవచ్చు. పెద్దవారిలో 60 65 శాతం మందిలో కేన్సర్ తగ్గితే, పిల్లల్లో 85 90 శాతం మందిలో పూర్తిగా నయం చేయవచ్చు. ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. వ్యాధి ముదిరాక గుర్తించినా ఫలితం అంతగా ఉండదు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ బారినపడిన చిన్నారుల్లో సగం మంది వ్యాధి గుర్తించక, వైద్యం అందక మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడయింది. ప్రతి ఏటా కొత్తగా రెండు లక్షల మంది చిన్నారులకు కేన్సర్ సోకుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కేన్సర్ కేసులు ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణ మధ్య ఆసియా, పసిఫిక్ ఐలాండ్స్‌లో నమోదవుతున్నా యి. 2015 నుంచి ప్రపంచంలోని చాలా దేశాల్లో లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాపిస్తోంది. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ బాధిత చిన్నారులకు అవసరమైన మందులు, ఆహారం అందుబాటులో ఉండటం లేదు. దీంతో కేన్సర్ సోకిన అత్యధిక మంది పిల్లలు ఐదేళ్ళకు మించి బతక్కపోవడానికి, కేన్సర్‌ను సకాలంలో గుర్తించకపోవడం, వైద్యం ఖర్చు భరించలేనంతగా ఉండడం, మధ్యలోనే చికిత్స ఆగిపోవడం వంటి కారణాలు చిన్నారుల పాలిట శాపంగా మారాయి.

రక్త కేన్సర్ (లుకేమియా, లింఫ్ వ్యవస్థ కేన్సర్ (లింఫోమా), మెదడు కేన్సర్, ఎముక కేన్సర్ (బోన్ సార్కోమా), కంటి కేన్సర్ (రెటీనోబ్లాస్టోమా), నాడీ కణాల కేన్సర్ (న్యూరోబ్లాస్లోమా), కిడ్నీ కేన్సర్ (విల్మ్స ట్యూమర్), కండర కేన్సర్ (రాబ్డోమయోస్కారోమా) వంటి కేన్సర్లు 19 ఏళ్లలోపు వయస్సున్న వారిలో వెలుగు చూస్తున్నాయి. అమ్మాయిల కన్నా ఎక్కువగా అబ్బాయిల్లోనే ఈ కేన్సర్ లక్షణాలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని ఎయివ్‌‌సు, చెన్నైలోని అడయార్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లలో సేకరించిన డేటా ప్రకారం అబ్బాయిల్లోనే కేన్సర్ లక్షణాలు అధికంగా ఉంటున్నట్లు ఢిల్లీలోని ‘పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా’ తెలిపింది.

అయితే ఆమ్మాయిల్లో కేన్సర్ బారిన పడినా బయటకు పొక్కనీవ్వకుండా ఉంచడం వల్ల అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు భావిస్తున్నారు. కేన్సర్ సోకినప్పటికీ లింగ వివక్ష కారణంగా వారిని ఆసుపత్రి వరకు తీసికెళ్లి వైద్యులకు చూపించకపోవడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పరీక్షల్లో వారికి కేన్సర్ అని తేలినా, చికిత్స చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. చికిత్స ఖర్చు పెరిగే కొద్దీ అమ్మాయిల విషయంలో వివక్ష చూపిస్తున్నారు. దక్షిణ భారతంతో పోలిస్తే ఉత్తరాదిన; మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్ బాధితులకు చికిత్స విషయంలో ఈ లింగ వివక్ష ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కేన్సర్ పరీక్షల విషయంలోనే కాదు, ఎంతో మంది కేన్సర్ బాధితులు అత్యంత ఖరీదైన మూలకణ మార్పిడి చికిత్స చేయించుకుంటున్నారో అనే అంశాన్ని కూడా వైద్యులు పరిశీలించారు.

ఈ విషయంలో కూడా లింగ వివక్ష ఉన్నట్లు స్పష్టమైంది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే ఎక్కువగా చికిత్స చేయిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడయింది. ప్రజల్లో ఉన్న ఈ తరహా ఆలోచనాధోరణని మార్చాలని వైద్యులు తెలియజేస్తున్నారు. మన రాష్ర్టం విషయానికొస్తే సుమారు ఐదు వేల మంది చిన్నారులు ప్రతి ఏటా కేన్సర్‌కు గురవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జన్యుపరంగానే ఎక్కువ మంది దీని బారినపడుతున్నట్లు తేలింది. పదేళ్ల వయస్సులోపు పిల్లల సంఖ్య అధికంగా ఉంటోంది.

ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో మధ్య తరగతి, ఆ కింది స్థాయి వారి సంఖ్య అధికంగా ఉంటోంది. జన్యుపరంగా తల్లిదండ్రుల్లోని క్రొమోజోముల స్థాయిని బట్టి 10 లేదా 11 ఏళ్లకు కూడా కొందరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. స్క్రీనింగ్‌కు రాకపోతుండడంతో కేన్సర్‌కు గురైన వారి సంఖ్య గణనీయంగానే ఉంటున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, ప్రజల్లో చైతన్యం పెరిగినా నేటికీ చాలా మంది రోగ నిర్థారణకు ముందుకు రావడం లేదు. యుక్త వయస్సుతో పాటు చిన్నారుల్లో వచ్చే కేన్సర్ ప్రమాదకరం కాగా, 50 శాతం జన్యు సంబంధంగా వస్తే, మరో 20 శాతం అలవాట్ల కారణంగా సంభవిస్తున్నాయి. నాలుగు తరాల కిందటి వారిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నా, ఆ తర్వాత పిల్లలకు కేన్సర్ సోకే ప్రమాదముంది. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందిచడానికి సాధ్యమవుతుంది.

కేన్సర్ బారిన పడిన చిన్నారుల్లో 3వ వంతు అసంపూర్ణ చికిత్స కారణంగా బతికే అవకాశాన్ని కోల్పోతున్నారు. దిగువ, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో 30 శాతం మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు. మరింత పేదరికంలో ఉన్న దేశాల్లో 99 శాతం మంది చికిత్స చేయించకపోవడం, లేదంటే చికిత్సను మధ్యలోనే నిలిపి వేయడం జరుగుతోంది. ఇక ప్రత్యామ్నాయ, సాంప్రదాయ చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నవారు 31 శాతం ఉండగా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చికిత్సను మానుకుంటున్నవారు 28 శాతం ఉన్నారు. ఇక కేన్సర్‌కు చికిత్స లేదనీ, నయం కాని వ్యాధని భావిస్తున్న వారు 26 శాతం. ఏదేమైనా అందివచ్చిన ఆధునిక వైద్య చికిత్స ద్వారా కేన్సర్‌ను నయం చేయడానికి వైద్యులు కృషి చేస్తున్నారు.

ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యే క వైద్యశాలలను ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్సను అందిస్తున్నది. చికిత్సలో భాగంగా కీమోథెరపీ ప్రధానమైనది. ఒక్కోసారి సర్జరీ చేయాల్సి రావొచ్చు. రేడియేషన్ వల్ల దుష్ర్పభావాలు ఉండటానికి ఆస్కారముంది. పది, పదిహేను సంవత్సరాల తర్వాత ఈ దుష్ర్పభావాలు బయటపడే అవకాశముంటుంది. అందుకే వీలైనంత వరకు రేడియేషన్ లేకుండానే చికిత్స చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం రేడియేషన్‌ను ఉపయోగిస్తున్నారు.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News