ఎన్‌టిఎజిఐ నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ : 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) సభ్యుడొకరు తాజాగా ఓ జాతీయ మీడియాతో అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పినట్టు పేర్కొన్నారు. భారత్‌లో 12 ఏళ్ల లోపు చిన్నారుల్లో కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. ఈ వయసు వారిలో కొందరికి కరోనా సోకినప్పటికీ ఆ తీవ్రత తక్కువ గానే ఉంది. ఈ డేటాను విశ్లేషించిన తరువాత చిన్నారులకు ఇప్పుడే కరోనా టీకాలు ఇవ్వడం అత్యవసరం కాదని అనిపిస్తోంది.
ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం అని ఎన్‌టిఎజిఐ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై తమ ప్యానెల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నిపుణుల సూచన మేరకే చిన్నారులకు టీకా పంపిణీపై ముందుకు వెళ్ల నున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నప్పటికీ భారీస్థాయిలో మాత్రం ఎక్కడా జరగలేదని కేంద్ర మంత్రి అన్నారు. మరోవైపు స్వదేశీ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ది చేసిన జైకోవ్ డి టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని పంపిణీపై కేంద్రం ఇంకా ప్రకటన చేయలేదు. ఈ టీకాలను తొలుత ఏడు రాష్ట్రాల్లో అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.