నేటి బాలలే రేపటి పౌరులు భావి భారత మార్గదర్శకులు’ అందుకే పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో విలువలు పెంచేలా ప్రయత్నించడం బాల సాహిత్యకారుల తక్షణ కర్తవ్యం.పిల్లల కోసం రచనలు చేయడమే కాకుండా వారితోనే రచనలు చేయించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లలకు పోటీలు నిర్వహించి, వారిలోని సృజనాత్మకతను ఆలోచనలను వెలుగులోకి తీసుకురావడం హర్షించదగ్గ పరిణామం. నిజానికి చెప్పాలంటే పిల్లల కోసం పెద్దలు కథలు రాయడం చాలా కష్టమైన పని ఎందుకంటే, మొదట వారి లేత మనసులు అర్థం చేసుకోవాలి. అప్పుడే వారి మానసిక స్థాయికి తగ్గట్టు కథలు రాయడం వీలవుతుంది.
బాలలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో అబ్బుర పడతాం, వారిని చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లల మాటలను వింటుంటాం వారు కథలను రాస్తే చదవకుండా ఉండలేం .పిల్లలు రాసేటివి చిన్న చిన్న కథలు అయినా అందులో అపారమైన సూక్తులు ఉంటాయి. అలాంటి పిల్లలతో కథలు రాయించేందుకు పూనుకోవడం అంతేకాకుండా పోటీలు నిర్వహించి కథలను పుస్తకంగా ముద్రించడం ప్రశంసనీయం ఉరిమల్లె సునంద గారి గురించి చెప్పనవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పరిచయం అక్కరలేదు. ప్రతి ఏడు బాలల దినోత్సవం సందర్భంగా ‘వురిమళ్ళ ఫౌండేషన్‘ ఆధ్వర్యంలో సునంద గారు జాతీయస్థాయిలోకథల పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు, పత్రాలు అందజేస్తున్నారు.
వురిమళ్ల సునంద గారు భాషోపధ్యాయురాలిగా తను పని చేసే బడిలోని విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారితో చక్కటి కథలను రాయిస్తూ, పిల్లల కోసం రచనలు చేస్తూ పేరు సంపాదించారు. కేవలం విద్యార్థుల కోసం కథల పోటీలు నిర్వహించి ముద్రణ రూపకంగా సంకలనం తీసుకురావడం అభినందనీయం . ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి ‘అని అబ్దుల్ కలాం గారుచెప్పినట్లు విశాల్ ‘నా కల ‘అనే కథలో ప్రయత్నాలు చేసినప్పుడే విజేతలమవుతామని మంచి సందేశం ఇచ్చాడు. ‘చెట్లు ఉంటే క్షేమం లేకుంటే క్షామం‘ చెట్లను రక్షించడమే మన విధి అంటూ పచ్చని చెట్ల వలన కలిగే ఉపయోగాలను నవీన ‘చెట్టు మేలు‘ కథలో చెప్పింది.
తన తప్పును తెలుసుకునేవాడు నిజమైన మనిషి అని ఒగ్గు సునీత ‘పశ్చాత్తాపం ‘కథలో నేటి కాలపు మనుషుల స్వభావాన్ని ఆవిష్కరించింది. మనం ఎవరికైనా సహాయం చేస్తే , అది మనకు ఏదో ఒక విధంగా మేలును చేకూరుస్తుందని అపూర్వ ‘ఒక చిన్న సహాయం‘ కథలో చక్కటి విషయాన్ని చెప్పింది. సమయస్ఫూర్తి ఉంటే అపాయంలో కూడా ఉపాయాన్ని ఆలోచించవచ్చని అంకిత ‘సమయస్ఫూర్తి’ కథలో తెలియ జెప్పింది. మన స్నేహితులు మన మంచిని కోరుతారు చెడును కాదు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ ‘ఒకే మాట ఒకే బాట‘ కథలో నల్ల కుందేలు తెల్ల కుందేలు ద్వారా వైభవ్ కథను చక్కగా మలిచాడు. సమాజంలో పేరుకుపోయిన సాంఘిక దురాచారాలను నిర్మూలించాలని చుట్టుపక్కల గ్రామాల్లో బాల్యవివాహాలను నిర్మూలించి ఆడపిల్లలను చదివించాలని సుహాన ‘దురాచారాలను నిర్మూలించడం‘ అనే కథలో అభిప్రాయపడింది. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదు ఏదైనా ప్రయత్నించాలి అప్పుడే ఫలితం ఉంటుందని‘ మోహన్ ప్రయత్నం‘ అనే కథలో స్పందన మంచి సందేశాన్ని తెలియచెప్పింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అనే నానుడే‘ జీవిత పాఠం‘ కథలో నితీష చెప్పింది. ‘విశ్వాసo‘ కథలో సాయి ప్రియ మనుషుల లో ఉన్న రెండు నైజాలను బయటపెడుతుంది. మనిషికి చంచలమైన మనసు ఉండకూడదు అంటూ కథలో చక్కటి ముగింపు నిచ్చింది.
ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క కథ మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ 30 కథలను రాసిన బాల రచయితలు భవిష్యత్తులో మరో 300 మంది కొత్త రచయితలకు స్ఫూర్తిగా నిలుస్తారని నమ్మకం ఈ కథలను చదువుతే తెలుస్తుంది. విద్యార్థులకు ప్రాథమిక దశలోనే చక్కటి సృజన ఉంటుంది . వారు పరిశీలన, పరిజ్ఞానం కలిగి ఉంటారు .ఈ దశనుండే వారిలో రచన సామర్థ్యం పెంపొందినట్లయితే భవిష్యత్తులో వారి రచనా దృక్పథం వికసిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులను భావి రచయితలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో వురిమళ్ళ ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోత్సహిస్తున్న సునంద గారు జాతీయ స్థాయిలో సుమారు 600 కథలు పోటీ పడగా, 30 కథల ను ఎంపిక చేసి, ఆ స్థాయిని బట్టి బహుమతులు అందించడమే కాకుండా, పుస్తక రూపంలో ప్రచురించడం అభినందనీయం. ఇలాంటి ఉపాధ్యాయులు దొరకడం నేటితరం విద్యార్థుల అదృష్టంగా చెప్పవచ్చు ఈ పుస్తకంలోని కథలు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాయి ఒక మనసులో కలిగిన భావాలను ఎదుటివారితో మాటల్లో పంచుకునే ప్రయత్నం చేశారు ఈ కథల రాసినటువంటి విద్యార్థులు దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల వారే.
చక్కటి సందేశాత్మక కథలను రాసిన చిన్నారి బుడతలకు అభినందనలు అంతేకాకుండా వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేకమైన అభినందనలు ఈ అక్షర సేద్యమనే యజ్ఞం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, పుస్తక రూపంలో తీసుకువచ్చిన వురిమళ్ళ సునంద గారికి శతదా సహస్ర అభినందనలు. పుస్తకం ముఖచిత్రం చూడముచ్చటగా ఉంది. బాలలు రచనలు చేస్తున్నట్లు చక్కగా చిత్రించారు. పుస్తకం ధర50 రూపాయలు. డిటిపి ప్రింటింగ్ రాచమళ్ళ ఉపేందర్ ,స్టార్ ఆఫ్ సెట్ ప్రింటర్స్ స్టేషన్ రోడ్డు ఖమ్మం గారు చక్కగా చేశారు.
పుస్తక ప్రతులకు: వురిమల్ల సునంద
(బోగోజు ఉపేందర్ రావు)
సాహితీ లోగిలి, ఇంటి నెంబర్ 11-10- 694/5, బుర్హాన్ పురం, ఖమ్మం జిల్లా-507001,
సెల్ నెం. 9441815722
యాడవరం చంద్రకాంత్ గౌడ్
9441762105