Monday, January 20, 2025

చిన్నారుల విక్రయం మిగిల్చిన ప్రశ్నలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన చిన్నారుల విక్రయం అనేక ప్రశ్నలు మిగిల్చింది. ఇందులో న్యాయపర, నైతిక, మానవత్వం లాంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. పోలీసులు చిన్నారులను పెంచిన వారి నుంచి పట్టుకుని వారిని శిశు విహార్‌కు తరలిస్తున్నప్పుడు పెంచిన బంధం తెంచుకోలేని తల్లిదండ్రులు పడిన వ్యథాపూరిత ఆవేదన అందరినీ కలచివేసింది. దేశంలో దత్తత అంశం సంక్లిష్టంగా మారడమే చిన్నారుల విక్రయం అతిపెద్ద స్మగ్లింగ్‌గా మారడానికి కారణమైందని చెప్పవచ్చు. న్యాయపరంగా సంతానం లేని వారు బంధువుల పిల్లలనైనా, ఇతరులనైనా దత్తత తీసుకోవాలంటే రెండు నుంచి నాలుగేళ్ళు పడుతుంది.

ఈ ప్రక్రియ సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు. దేశంలో 2130 మంది చిన్నారులు దత్తతకు అందుబాటులో ఉంటే పిల్లలు కావాలనుకునే వారి సంఖ్య 35 వేలకు పెరిగింది. వీరందరికీ పిల్లలు కావాలంటే దశాబ్దం పట్టినా ఆశ్చర్యం అక్కర లేదు. దత్తత చట్టాన్ని సులభతరం చేసి వేగంగా ప్రక్రియను అమలు చేస్తే తప్ప అక్రమ రవాణా ఆగే పరిస్థితి కనిపించడం లేదు. న్యాయపరంగా దత్తత సంక్లిష్టం కావడంతోనే పిల్లలు లేనివారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు చెల్లించి చిన్నారుల అక్రమ రవాణా ముఠా నుంచి కొని చివరకు కేసుల పాలు కావడం అత్యంత విషాదకర పరిణామంగా చెప్పవచ్చు. పోలీసులు ఇటీవల 16 మందిని రక్షించిన తర్వాత 60 మందిలో మిగిలిన 44 మంది చిన్నారులు ఎక్కడ ఉన్నారని పోలీస్‌లు ఆరా తీస్తున్నారు.

ఇంతవరకు దొరికిన పిల్లల్లో ఇది వరకు అదృశ్యమైన తమ పిల్లలెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనలో రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. పిల్లలు లేని దంపతులు తాము గుట్టుగా పరాయి పిల్లలను కొనుక్కున్నప్పటికీ ఇప్పుడు ఆ పిల్లలు తమకు వరాల బిడ్డలుగా ప్రేమను పొందుతున్నారు. మూడు నుంచి ఐదేళ్లుగా తమ పెంపకంలో ఉండడంతో మమకారం పెంచుకుని విడిచిపెట్టలేని పరిస్థితి ఎదురయ్యింది. ఇప్పుడు వారిని చిన్నారుల సంరక్షణ కేంద్రానికి పోలీసులు అప్పగించడం కన్నీళ్ల పర్యంతమవుతోంది. పేగు బంధం కన్నా పెంచిన బంధం గొప్పదన్న మానవతా భావం వెల్లివిరుస్తోంది. వారిని తమకు దూరం చేయరాదని ప్రస్తుత దత్తత చట్టప్రకారమైనా తిరిగి తమకు అప్పగించాలని పెంచిన తల్లులు ప్రాథేయపడుతున్నారు. ఈ విషయంలో తాము ఏ కష్టనష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నామన్న అభిప్రాయంతో వారు ఉంటున్నారు.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది పోలీసులను ఫోన్ ద్వారా సంప్రదించగా వారి వివరాలతో తమ వద్దకు రావాలని పోలీసులు వారికి సూచిస్తున్నారు. ఈ చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ అక్రమ రవాణా ఏజెంట్లలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ మహిళా ఏజెంట్లు తల్లుల అవతారం ఎత్తి రాత్రిపూట చిన్నారుల్ని ఎత్తుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా బైక్ అంటే మగ, స్కూటీ అంటే ఆడపిల్ల అని కోడ్ భాష ఉపయోగించడం విస్మయం గొలుపుతోంది. ఇందులో ఢిల్లీ, పుణె, విజయవాడలకు చెందిన ఏజెంట్లు ఈ పిల్లల అక్రమ అమ్మకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు బయటపడింది. తాము రక్షించిన 16 మంది చిన్నారుల్లో 14 మందిని పోలీసులు చిన్నారుల సంరక్షణ కమిటీ (సిడబ్లుసి)కి అప్పగించారు. మరో ఇద్దరి వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ప్రస్తుతం శిశు విహార్ సంరక్షణలో ఉన్న మొత్తం 14 మంది పిల్లల్లో కొందరు కొత్తవారిని చూసి ఏడుస్తున్నారు. నిందితుల్లో కొందరు ఐదేళ్ల నుంచి చిన్నారుల్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిసింది. సంతానం లేని దంపతులను వలలో వేసుకుని వారికి పసికందుల్ని విక్రయించి లక్షలు ఆర్జిస్తున్నారు. నెలల వయసున్న పసికందుల్ని రెండు మూడు రోజుల వ్యవధిలోనే కొనుగోలుదారులకు చేరుస్తున్నారు. ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులను లక్షంగా చేసుకొని ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగుతోంది. అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అంచనా ప్రకారం 2 మిలియన్ల మంది పిల్లలు ప్రపంచ వాణిజ్య సెక్స్ వ్యాపారం ద్వారా దోపిడీకి గురవుతున్నారని 2008లో వెల్లడైంది. 2007లో నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దక్షిణాసియా మార్చ్‌ను చేపట్టి కోల్‌కతా నుంచి ఖాట్మండ్ వరకు నిర్వహించారు. పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా బచ్‌పన్ బచావో ఆందోళన్ (బిబిఎ) ఉద్యమాన్ని సాగించడం మొదలు పెట్టింది. బచ్‌పన్ బచావో ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 మంది పిల్లలను రక్షించగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News